దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం, అన్నాచెల్లెళ్ల వైరం రోజురోజుకూ పతాకస్థాయికి చేరుతోంది. వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి వివాహం బెంగళూరు యలహంకలోని వైఎస్సార్ నివాసంలో జరగాల్సి ఉండగా, దానికి జగన్ అడ్డు చెప్పడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రతి కుటుంబంలోనూ మేనకోడలి పెళ్లికి ఆశీస్సులు అందిస్తూ, ఆ వేడుకను మరపురాని జ్ఞాపకంగా మార్చేందుకు తపించే మామ ఉంటాడు. కానీ, ఇక్కడ జగన్ మాత్రం YSR కుటుంబంలో కన్న మేనకోడలి పెళ్లిని సొంత ఇంట్లో జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు.
ఈ ఇష్యూపై లోకేష్ నేరుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలిని, కన్న మేనకోడలిని ఈ రీతిలో వేధిస్తున్నారంటే.. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను ఏ విధంగా చూసుకున్నారో ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని లోకేష్ చురకలు అంటించారు. కుటుంబ బాధ్యతలను విస్మరించి, ఆస్తుల కోసం సొంత చెల్లెల్ని కూడా కష్టపెడుతున్నారని ఆయన విమర్శించారు.
బెంగళూరు యలహంక నివాసం మొత్తం తనదేనని, ఆ ఇంటితో సహా వైఎస్సార్ కట్టించిన భవనాలన్నింటిపై తనకే హక్కు ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మూలంగా మారాయి. తన కుమార్తె పెళ్లి వేడుకకు సొంత అన్న జగన్ అడ్డుపుల్లలు వేయడంపై షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కథనాలు బయటకు రావడంతో ఈ అంశంపై రాజకీయంగానూ పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ వ్యవహారాన్ని టీడీపీ నేతలు జగన్ రాజకీయ నైతికతకు, ఆయన నైజానికి నిదర్శనంగా చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.
వైఎస్ కుటుంబంలో చెలరేగిన ఈ ఆస్తి వివాదం, మేనకోడలి పెళ్లి రచ్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు షర్మిల వేస్తున్న ప్రశ్నలు, మరోవైపు నారా లోకేష్ వంటి ప్రత్యర్థి నేతల ఘాటైన విమర్శలతో జగన్ తీరుపై సర్వత్రా నిరసనలు, చర్చలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫ్యామిలీ వార్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
