పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (PoE) తాజా నివేదిక పలు కీలక సానుకూల అంశాలను వెల్లడించింది. ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్ (డీ-వాల్) నాణ్యత, ప్లాస్టిక్ కాంక్రీట్ పనితీరు, నాణ్యత నియంత్రణ చర్యలు, ఎరోషన్ నిరోధకతకు సంబంధించిన పరీక్షల్లో సంతృప్తికరమైన ఫలితాలు నమోదైనట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్మాణ సంస్థగా మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) కీలకంగా భాగస్వామ్యమవుతోంది.
డీ-వాల్ నిర్మాణం, నాణ్యతపై PoE ప్రత్యేకంగా సమీక్షించింది. సుమారు 67,148 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డీ-వాల్ నిర్మాణం పూర్తయినట్లు నివేదిక పేర్కొంది. నిర్మాణ సమయంలో అమలు చేసిన నాణ్యత నియంత్రణ, నాణ్యత హామీ పరీక్షల ఫలితాలు సాధారణంగా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. నాణ్యత పరీక్షల సంఖ్య కూడా కనీస నిర్దేశిత అవసరాలను మించిందని నివేదిక పేర్కొంది.
డీ-వాల్ నిర్మాణంలో ఉపయోగించిన హార్డెన్డ్ ప్లాస్టిక్ కాంక్రీట్ పరీక్షల్లో అన్ని కీలక విలువలు నిర్దేశిత ప్రమాణాలను చేరుకున్న లేదా మించిన ఫలితాలు నమోదయ్యాయి. కాలక్రమంలో కాంక్రీట్ బలం పెరుగుతున్నట్లు పరీక్షలు సూచిస్తున్నాయని, దీర్ఘకాలంలో డీ-వాల్ సీపేజ్ నియంత్రణ పనితీరు సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉందని PoE పేర్కొంది.
అన్ని పరీక్షల్లో నెగ్గిన డయాఫ్రంమ్ వాల్
డీ-వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్‌పై నిర్వహించిన ప్రత్యేక ఎరోషన్ పరీక్షలు కూడా అత్యంత సానుకూల ఫలితాలను ఇచ్చాయి. పరీక్షల్లో ఎరోషన్ చాలా తక్కువ స్థాయిలో నమోదైందని, పరీక్షా పరిస్థితుల్లో ఎరోషన్ చాలా నెమ్మదిగా జరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇది ప్లాస్టిక్ కాంక్రీట్‌కు మంచి ఎరోషన్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు సూచిస్తుందని నిపుణుల కమిటీ పేర్కొంది.
డీ-వాల్ నుంచి సేకరించిన కాంక్రీట్ కోర్ నమూనాల పరీక్షల్లో కంప్రెసివ్ స్ట్రెంగ్త్ నిర్దేశిత కనీస ప్రమాణాల కంటే గణనీయంగా ఎక్కువగా నమోదైంది. అలాగే Permeability పరీక్షల్లోనూ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణమైన ఫలితాలు నమోదయ్యాయి.
డీ-వాల్ నిర్మాణంలో కొన్ని ప్యానళ్లలో బ్లీడింగ్ నమోదైనప్పటికీ, PoE నిర్వహించిన పరిశీలనలు, పరీక్షల ఆధారంగా ఈ బ్లీడింగ్ డీ-వాల్ పనితీరును దెబ్బతీయలేదని నిర్ధారించింది. ప్రభావిత ప్యానళ్ల నుంచి సేకరించిన నమూనాల్లోనూ సెగ్రిగేషన్ లేదా కాంక్రీట్ పనితీరు తగ్గినట్లు ఆధారాలు కనిపించలేదని నివేదిక పేర్కొంది.
నాణ్యమైన నిర్మాణ సామాగ్రి
ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇంపెర్వియస్ ఫిల్ మెటీరియల్ విషయంలోనూ PoE సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే ధ్రువీకరించిన వనరులతో పాటు అదనపు వనరులను కూడా గుర్తించినట్లు నివేదిక తెలిపింది. అయితే అదనపు వనరుల వినియోగానికి అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంది.
GAP-I, GAP-II ECRF డ్యామ్ నిర్మాణానికి అవసరమైన రాక్‌ఫిల్ వనరులు కూడా గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం పరిమాణానికి ఇవి సుమారుగా సరిపోతాయని, అయితే అదనపు ధ్రువీకరణ అవసరమని PoE తెలిపింది.
GAP-II ECRF డ్యామ్ డిజైన్‌లో గణనీయమైన పురోగతి నమోదైందని కూడా PoE పేర్కొంది. తాజా site investigations, laboratory testing, permeability testing, consolidation analysis తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్‌ను మరింత అభివృద్ధి చేసినట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుత డిజైన్ విధానం గత దశలతో పోలిస్తే గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొంది.
షెడ్యూల్ ప్రకారం సాగుతున్న ప్రాజెక్టు పనులు
ప్రాజెక్టు మొత్తం నిర్మాణ పనులు నిర్దేశిత లక్ష్యాల దిశగా కొనసాగుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు PoEకి వివరించారు. గతంలో ఇంధనం, పేలుడు పదార్థాల లభ్యతకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా ఆలస్యాలు ఎదురైనప్పటికీ, వాటిని పరిష్కరించినట్లు నివేదిక పేర్కొంది.
మొత్తంగా, పోలవరం ప్రాజెక్టులో డీ-వాల్ నిర్మాణం, ప్లాస్టిక్ కాంక్రీట్ నాణ్యత, ఎరోషన్ నిరోధకత, నాణ్యత నియంత్రణ, కాంక్రీట్ బలం, GAP-II ECRF డ్యామ్ డిజైన్ తదితర కీలక అంశాల్లో సంతృప్తికరమైన ఫలితాలు, గణనీయమైన పురోగతి నమోదైనట్లు తాజా నిపుణుల నివేదిక స్పష్టం చేస్తోంది.
