తెలంగాణలో తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తిరిగి పెంచడంతో పాటు రైతులకు ఆధునిక సాంకేతికత, నాణ్యమైన ఇన్‌పుట్స్, సాగునీటి సదుపాయాలు, శిక్షణ, ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్, మార్కెటింగ్ వంటి అన్ని రంగాలను సమన్వయం చేసి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ రోజు శాసనసభలో తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సాగుపై కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, యశశ్వినీ రెడ్డి, తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం…
గతంలో తెలంగాణలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే, ప్రస్తుతం అది సుమారు లక్ష ఎకరాలకు తగ్గిపోయిందని మంత్రి తెలిపారు. ఫలితంగా 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ వానాకాలంలో 51000 సాధారణ విస్తీర్ణానికి గాను 72,583 ఎకరాలలో కూరగాయల సాగు జరిగిందని తెలిపారు.
కూరగాయల ధరలు ప్రధానంగా డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉండటం వల్ల మార్కెట్లో ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. రైతులకు లాభదాయకమైన పంటల వైపు వెళ్లేలా ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
సాగుకు అవసరమైన సదుపాయాలపై భారీగా రాయితీలు…
కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు నారు, మల్చింగ్, షేడ్‌నెట్, శాశ్వత పందిళ్లు, బిందు మరియు తుంపర సేద్యం వంటి సదుపాయాలను రైతులకు రాయితీలపై అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూరగాయల నారు, మల్చింగ్, షేడ్‌నెట్ కోసం రూ.20 కోట్లు, శాశ్వత పందిళ్ల కోసం రూ.8 కోట్లు, బిందు సేద్యం కోసం రూ.97 కోట్లుకేటాయించినట్లు వెల్లడించారు. అన్ని పంటలకు విస్తీర్ణం ఆధారంగానే రైతు భరోసా అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
రెండు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగుకు కార్యాచరణ
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తక్షణమే పెంచేందుకు ప్రస్తుత వానాకాలంలో సుమారు లక్ష ఎకరాల్లో, తదుపరి రబీ సీజన్‌లో మరో లక్ష ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణకు అవసరమైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా చేసి, తెలంగాణలో పండించిన కూరగాయలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్థాయికి ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం.. సమతుల్య రాయితీల విధానం…
రైతులు అధిక దిగుబడి, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల వైపు వెళ్లేలా వ్యవసాయ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని పంటలు, కొన్ని పద్ధతులకే రాయితీలు పరిమితం కావడం వల్ల వ్యవసాయంలో సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
రైతులకు అవసరమైన పంటలు, భూమి సంరక్షణ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే విధంగా రాయితీల విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సేద్యాన్ని కూడా పెంచి పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని రైతులకు అవగాహాన కల్పించాలని కోరారు.
ఎరువుల విధానంపై కేంద్రంతో సమన్వయం అవసరం..
యూరియా వినియోగం పెరగడం వల్ల పురుగు మందుల వినియోగం కూడా పెరుగుతోందని మంత్రి తెలిపారు. యూరియా వినియోగాన్ని సమతుల్యం చేసేలా, భూమిని సంరక్షించే ఎరువులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా సబ్సిడీ విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
ఈ అంశంపై ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రితో పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో ఈ నెల 18న సమావేశం నిర్వహించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు.
పామాయిల్‌తో పాటు అంతర పంటలకు ప్రోత్సాహం…
తెలంగాణలో గతంలో పరిమితంగా ఉన్న ఆయిల్‌పామ్ సాగును ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించినట్లు మంత్రి తెలిపారు. ఆయిల్‌పామ్ తోటల్లో అల్లం, కంది, కూరగాయలు వంటి వివిధ అంతర పంటలను సాగు చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా వ్యవసాయ విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు.
ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్, ఎగుమతులకు ప్రాధాన్యం…
కూరగాయల ఉత్పత్తి పెంచడంతో పాటు వాటి నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను రాష్ట్రం తగిన స్థాయిలో వినియోగించుకోలేకపోయిందని పేర్కొంటూ, గత రెండు మూడు సంవత్సరాలుగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు రాష్ట్ర వాటాను జోడించి 60:40 నిష్పత్తిలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాయితీలు అందిస్తున్నామని చెప్పారు.
కోహెడలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్…
కోహెడ మార్కెట్‌కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 170 ఎకరాల్లో భారీ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వివిధ రకాల పంటలను నిల్వ చేసుకోవడం, మార్కెటింగ్ చేయడం, ఎగుమతులు చేపట్టడం వంటి సదుపాయాలతో ఈ మార్కెట్‌ను రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లోని పహాడిషరీఫ్, గుడిమల్కాపూర్ తదితర మార్కెట్ల సమస్యలను పరిష్కరించేందుకు డైరెక్టర్ మార్కెటింగ్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యతకు పెద్దపీట…
వ్యవసాయ విద్యలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 11 ప్రైవేట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలను తనిఖీ చేయగా, ప్రమాణాలు పాటించని 6 కళాశాలల అనుబంధాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన నాలుగు కళాశాలలను కూడా మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందని, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోతే వాటిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మౌలిక వసతులు, ప్రయోగాత్మక పొలాలు, ప్రయోగశాలలు, బోధన సదుపాయాలు, అధ్యాపకులు, విద్యార్థుల వసతి తదితర అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్నల్ మానిటరింగ్ కమిటీ, టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డిమాండ్ లేని కోర్సులను ఆధునీకరణకు అనుగుణంగా మార్పు…
వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు ప్రస్తుతం తగిన విద్యార్థుల డిమాండ్ లేదని మంత్రి తెలిపారు. గతంలో 750 సీట్లు ఉండగా వాటిని 450 సీట్లకు తగ్గించినప్పటికీ, కొన్ని కళాశాలల్లో 8 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే చేరుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నందున, ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించేలా కళాశాలలను పునర్వ్యవస్థీకరిస్తామని తెలిపారు.
ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా ఆధునీకరించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
ఆధునిక వ్యవసాయం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త దిశ
మారుతున్న వాతావరణ పరిస్థితులు, డిజిటల్ అగ్రికల్చర్, సాంకేతిక ఆవిష్కరణలకు అనుగుణంగా వ్యవసాయ విద్య, పరిశోధనను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో 37వ ర్యాంకులో ఉండగా, గత రెండు మూడు సంవత్సరాల్లో తీసుకున్న చర్యలతో ప్రస్తుతం 19వ ర్యాంకుకు చేరిందని తెలిపారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయాన్ని మొదటి ర్యాంకుకు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
అవసరమైన టీచింగ్ స్టాఫ్, మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు ఆధునిక వ్యవసాయ పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు.. సీట్ల పెంపు…
వ్యవసాయ విద్యకు పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, వికారాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కళాశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో వ్యవసాయ విద్యలో సుమారు 1,100 సీట్ల సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం దాన్ని 2,000 సీట్లకు పెంచగలిగామని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవసరమైన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా వ్యవసాయ కళాశాలలను ఆధునీకరిస్తామని మంత్రి తెలిపారు.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా తెలంగాణలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం వ్యవసాయ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, ప్రయోగాత్మక పొలాలు, బోధనా సిబ్బంది, పరిశోధనా సదుపాయాలను బలోపేతం చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న కళాశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, వాటికి అనుగుణంగా సిబ్బందిని నియమించి నాణ్యమైన, ఆధునిక వ్యవసాయ విద్యను అందించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు
