రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల స్పెయిన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడానికి మంత్రి దుర్గేష్ ఈ పర్యటనలో చేసిన కృషి విశేష ప్రశంసలు పొందింది.
స్పెయిన్‌లోని సెవిల్లె నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక ‘టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026’ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని చేసిన ప్రసంగం, ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.. గ్లోబల్ టూరిజం ట్రెండ్స్, స్మార్ట్ డెస్టినేషన్స్, సుస్థిర పర్యాటక విధానాలపై పర్యాటక నిపుణులతో మంత్రి దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపుదిద్దుకున్న వినూత్న మోడల్ ‘NiVU AI'(Neural Intelligence Vernacular Unified Model) ను మంత్రి దుర్గేష్ ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు.
‘Explurger’ సంస్థ సహకారంతో ఏపీలోని 100కు పైగా ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలలో పర్యాటకులకు తమ సొంత భాషలోనే సమాచారం అందించేలా ఈ సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా స్పెయిన్‌కు చెందిన పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పర్యాటక సంస్థలతో మంత్రి దుర్గేష్ నేరుగా సమావేశమయ్యారు.
సుదీర్ఘ తీరప్రాంతంలో వెల్ నెస్ సెంటర్లు, టెంపుల్ టూరిజం, ఎకో-టూరిజం, రిసార్టుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమ్మిట్‌లో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “మీరు ఇప్పటికే భారతదేశాన్ని చూశామని భావిస్తే.. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి చూడండి, మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాం” అని పిలుపునివ్వడం గ్లోబల్ డెలిగేట్లను విశేషంగా ఆకట్టుకుంది.
పర్యటన అనంతరం విజయవాడ చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ పర్యటన ద్వారా లభించిన అనుభవాలు, ఆధునిక సాంకేతికత, అంతర్జాతీయ పెట్టుబడుల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.. మీ సందర్భంగా స్పెయిన్ లో తనకు లభించిన ఆతిథ్యం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
