రెన్యూ ఛైర్మన్ & సీఈవో సుమంత్ సిన్హాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రెన్యూ సంస్థ రాష్ట్రంలో పలుచోట్ల రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడంపై అభినందనలు తెలిపారు.
మంత్రి లోకేష్ తో చర్చల అనంతరం మరో రెండు భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుమంత్ సిన్హా సుముఖత వ్యక్తంచేశారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెన్యూ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మధ్య ఒప్పందం జరిగింది.
రాష్ట్రంలో కొత్తగా 2గిగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులో రూ.12,500 కోట్లు, గ్రీన్ అమ్మోనియా/ఈ-ఫ్యూయల్ ప్రాజెక్టులో రూ.17,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ… మరో రూ.11వేల కోట్ల విలువైన పాలి సిలికాన్, మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్ ప్రాజెక్టు సైతం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినందుకు అభినందనలు తెలియజేస్తూ… ప్రాజెక్టులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను ఏపీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) సహకారంతో తిరుపతి ఐఐటీలో ఏర్పాటు చేయబోయే సోలార్ సెల్ ప్రోటోటైపింగ్ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.
రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ తమ సంస్థ ఏపీలో 2015 నుంచే వివిధ ప్రాజెక్టులను నిర్వహిస్తోందని చెప్పారు. 2015లో మొదటి 24 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ కళ్యాణదుర్గంలో ఏర్పాటుచేశామని, ప్రస్తుతం 10 ప్రాంతాల్లో 717 మెగావాట్ల విండ్, 60 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గుంతకల్లులో రూ.22,000 కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. ఇందులో 1.8 జీడబ్ల్యూ సోలార్, 1 జీడబ్ల్యూ విండ్, 2 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ స్టోరేజ్ అంతర్భాగాలుగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో రెన్యూ సంస్థ ఆధ్వర్యాన రూ.85,200 కోట్ల విలువైన 1,000 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆగస్టులో ఎస్ఐపీబి ఆమోదం లభించింది.
రాంబిల్లిలో రూ.4,200 కోట్ల విలువైన 6.5 జీడబ్ల్యూ ఇంగాట్-వేఫర్ ప్లాంట్ కు ఆగస్టులో శంకుస్థాపన చేశాం. మరో 2 జీడబ్ల్యూ పంప్డ్ స్టోరేజ్, 300 కేటీపీఏ గ్రీన్-అమ్మోనియా ప్లాంట్, 5 జీడబ్ల్యూ హైబ్రిడ్ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు.
