ప్రత్యేకంహోమ్

రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌

#Chandra

రాయలసీమ ప్రాంతాన్ని రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసి, ప్రపంచానికే ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహకారంతో కరవు ప్రాంతంగా పేరుపొందిన రాయలసీమ అభివృద్ధికి చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేసే దిశగా రాయలసీమలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో మొత్తం రూ.లక్ష కోట్ల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ పరిధిలోని మొత్తం 10 జిల్లాల్లో 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా ఆరు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును విస్తరించే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.

హార్టీ కల్చర్ హబ్ తో సంపద సృష్టి

ప్రాథమిక రంగం అభివృద్ధిలో ఉద్యాన రంగం కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఉద్యాన రంగం ద్వారా సుమారు రూ.1.5 లక్షల కోట్ల స్థూల విలువ జోడింపు (జీవీఏ) లభిస్తోందని, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా మరో లక్ష కోట్ల రూపాయల జీవీఏను సాధించగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి సదుపాయాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వ్యవస్థలను సమన్వయం చేస్తే రాయలసీమ రైతులు అధిక ఆదాయం పొందగలరని అన్నారు.

యాపిల్ నుంచి స్ట్రాబెర్రీ వరకు, అరటి నుంచి అవకాడో వరకు, కివీ నుంచి ఖర్జూరం వరకు వివిధ రకాల పండ్ల సాగుకు రాయలసీమను అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పంటల సాగుతో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలు, నిల్వ సదుపాయాలు, రవాణా, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించవచ్చని వివరించారు. పంటల ఉత్పత్తి పెరగడంతో పాటు ధరల్లో ఒడిదుడుకులను తగ్గించి రైతులకు ప్రయోజనం కలిగించేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేను ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డను

ఈ కార్యక్రమంలో భాగంగా రాయలసీమలో పండించిన పండ్ల ఉత్పత్తులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీకి ముఖ్యమంత్రి అందజేశారు. అనంత్ అంబానీని ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగా భావిస్తున్నామని వేదికపై ప్రకటించారు. రిలయన్స్ సంస్థ సహకారంతో మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఐఐఎంలలో నిర్వహణ నిపుణులు, ఐఐటీలలో సాంకేతిక నిపుణులు, ఐఎస్‌బీలో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు కలిగిన వారు తయారవుతున్నట్లే, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించగల నిపుణులు తయారవుతారని చంద్రబాబు వివరించారు. వ్యవసాయం, ఉద్యాన రంగాల్లో ఆధునిక పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడంలో ఈ సంస్థ కీలకంగా నిలుస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతికతను అందించాలని రిలయన్స్ సంస్థను కోరారు.

రాయలసీమ అభివృద్ధికి సాగునీరు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం ఒకటని, గతంలో ఎడారిని తలపించే పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రాంతాన్ని ఆదుకోవాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు బిందు సేద్యం వంటి సాంకేతిక విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జల సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు కార్యాచరణ చేపట్టామని వివరించారు.

హంద్రీ నీవా నీటిని కుప్పం వరకూ తీసుకెళ్లాం

రూ.3,500 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా కాలువ పనులను పూర్తి చేసి కుప్పం వరకు నీటిని తీసుకెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీటిని అందించే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాయలసీమలో హంద్రీ-నీవా, మడకశిర బ్రాంచ్ కెనాల్, మల్లెమడుగు, బాలాజీసాగర్, అప్పర్ పేరూరు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో రూ.35 వేల కోట్ల వ్యయంతో 36 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో హైటెక్ ముఖ్యమంత్రి, సీఈఓ ముఖ్యమంత్రి వంటి పేర్లతో పిలిచారని, ఇప్పుడు వాటర్‌మ్యాన్‌గా గుర్తించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని చంద్రబాబు అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీటి నిర్వహణ, నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

గోదావరి నదిలో ఈ ఏడాది కూడా సుమారు 1,600 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పదేళ్ల కాలంలో సుమారు 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. కృష్ణా డెల్టాలో ఆదా చేసిన నీటిని రాయలసీమకు మళ్లించడం నదుల అనుసంధానం వల్లే సాధ్యమైందని వివరించారు. పట్టిసీమ నిర్మాణ సమయంలో అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. ఆ ప్రాజెక్టు లేకపోతే రాయలసీమ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో విద్యుత్ గ్రిడ్, రహదారుల అనుసంధానం, డిజిటల్ కనెక్టివిటీ అభివృద్ధి చెందినట్లే, ఇకపై నీటి అనుసంధాన వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా నదుల అనుసంధానంపై ఆలోచనలు చేశారని గుర్తుచేశారు.

నదుల అనుసంధానం అత్యవసరం

దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి వివాదాల కారణంగా సమయం, వనరులు వృథా అవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తరలించే అంశాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. ఈ తరహా ప్రణాళిక అమలైతే నాలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందని, నీటి వివాదాల స్థానంలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవచ్చని అభిప్రాయపడ్డారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంటిని ఎలా నిర్వహించాలో మహిళలకు బాగా తెలుసని, అదే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంలో నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ దేశ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు అందిస్తున్నారని పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను సంస్కరణలు, నిరర్థక ఆస్తుల నియంత్రణ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థలో లీకేజీల నివారణ వంటి అంశాల్లో ఆమె కృషిని ప్రస్తావించారు. అమరావతి, విశాఖ ఉక్కు కర్మాగారం, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు.

శ్రీవారికి విద్యుత్ బస్సులు ఇచ్చిన రిలయన్స్

రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ జంతు సంరక్షణ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారని చంద్రబాబు అన్నారు. వనతార సంస్థ ద్వారా జంతువుల సంరక్షణకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తిరుమల శ్రీవారిపై భక్తితో విద్యుత్ బస్సులను కూడా సమకూర్చారని ప్రస్తావించారు. ఇప్పుడు వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి రిలయన్స్ సంస్థ సహకారం అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విత్తనం నుంచి ఎగుమతి వరకు రైతులకు మద్దతు అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయ సాంకేతికత, సరుకు రవాణా, నిల్వ సదుపాయాలు, వ్యవసాయ మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్లు కల్పించవచ్చన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాలు రాయలసీమ ఆర్థిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి దోహదపడతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

బందర్‌ పోర్టుపై వైసీపీ క్రెడిట్‌ చోరీ…. అసలు నిజం ఇది!

Satyam News

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌

Satyam News

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వైభవంగా ఆర్జిత సేవలు

Satyam News

సాకారమవుతున్న అమరావతి స్వప్నం

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగిన శాకంబరీ ఉత్సవాలు

Satyam News

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

Leave a Comment