తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ రెండు కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ 8న రక్షణ రంగ ఎక్స్పో, ఎయిర్ షో
డిసెంబర్ 8న భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న రక్షణ రంగ ఎక్స్పో (రక్షా ఎక్స్పో), ఎయిర్ షో తదితర ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు విద్యార్థులను పెద్ద సంఖ్యలో తీసుకురావాలని సీఎస్ సూచించారు. అలాగే డిసెంబర్ 11న జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న ప్రగతి, అంతర్జాతీయ పెట్టుబడుల అవకాశాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. క్రీడా పోటీలను చూడటం ద్వారా క్రీడాస్ఫూర్తి, పట్టుదల, క్రమశిక్షణ అలవడటంతో పాటు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణ లభిస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు
విద్యార్థులను కార్యక్రమాలకు తరలించేందుకు టీజీఎస్ఆర్టీసీ అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోని గురుకుల, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులను కార్యక్రమాలకు తీసుకురావాలని తెలిపారు. ప్రయాణం, భోజనం, అల్పాహారం, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల సమీకరణ, సమన్వయ బాధ్యతలను మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సైదులుకు నోడల్ అధికారిగా అప్పగించారు.
8 వేల మంది క్రీడాకారుల భాగస్వామ్యం
అనంతరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ ప్రత్యేకంగా సమీక్షించారు. సుమారు 8,000 మంది క్రీడాకారులు పాల్గొననున్న ఈ పోటీల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
క్రీడాకారులకు వసతి, రవాణా, ప్రోటోకాల్, భద్రత, వైద్య సహాయం, హౌస్‌కీపింగ్, పారిశుద్ధ్యం, క్రీడా సామగ్రి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పోటీలకు విస్తృత మీడియా కవరేజీ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురానున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని సీఎస్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సబ్యసాచి ఘోష్, వాణి ప్రసాద్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజేంద్ర, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీవుల్లా, TGTSWREIS కార్యదర్శి జి. రవి, TTWREIS కార్యదర్శి సీతా లక్ష్మి, TGBC స్టడీ సర్కిల్ డైరెక్టర్ హరికృష్ణ, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
