ఇరాన్ పై యుద్ధానికి మళ్లీ అమెరికా సిద్ధం అవుతున్నదా? అనే ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలలో పేట్రియాట్ క్షిపణులను మోహరించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు చూస్తూ ఇది స్పష్టం అవుతున్నది కూడా.
అమెరికాకు చెందిన ఇద్దరు అధికారులు, ప్రాంతీయ వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియోస్ ఈ విషయాన్ని పేర్కొన్నట్లు సమాచారం. గత నెలలో సౌదీ అరేబియాలోని కీలక చమురు కేంద్రం రక్షణ కోసం ఒక పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను అమెరికా మోహరించినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యవస్థను ఖతార్‌లోని సహజవాయువు కేంద్రం రక్షణ కోసం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి భారీ స్థాయిలో సైనిక చర్యలు ప్రారంభించిన పక్షంలో సౌదీ అరేబియా, ఖతార్‌లోని కీలక ఇంధన మౌలిక వసతులను అమెరికా రక్షిస్తుందనే భరోసా కల్పించడమే ఈ మోహరింపుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇంధన ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలపై దాడుల ముప్పు ఉన్న నేపథ్యంలో వాటి భద్రతకు అమెరికా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ చర్యలు సూచిస్తున్నాయి.
ఇరాన్‌తో అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగే పరిస్థితుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా చమురు మరియు సహజవాయువు మౌలిక వసతుల భద్రత కీలకంగా మారింది. పేట్రియాట్ వ్యవస్థలను మోహరించడం ద్వారా అమెరికా ముందస్తు రక్షణ చర్యలను చేపడుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే ఇరాన్‌పై అమెరికా తదుపరి సైనిక చర్యలపై అధికారికంగా స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇరాన్‌పై మరోసారి పెద్దఎత్తున సైనిక చర్యలు చేపట్టే అవకాశాల నేపథ్యంలో అమెరికా తన రక్షణ ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సౌదీ అరేబియా, ఖతార్‌లోని కీలక ఇంధన మౌలిక వసతుల రక్షణ కోసం అదనంగా రెండు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలను అమెరికా మోహరించినట్లు అనడోలు సంస్థ తెలిపింది.
అయితే ఈ మోహరింపులపై అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా స్పందించలేదు. సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించినట్లు సమాచారం.
