జాతీయంహోమ్

నితిన్ నబీన్ కొత్త టీమ్: ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి

#NitinNabin

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది కీలక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గంలో భారీ మార్పులు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో కొత్త జాతీయ ఆఫీస్ బేరర్ల బృందాన్ని సోమవారం ప్రకటించింది. అనుభవజ్ఞులైన నేతలతో పాటు యువ నాయకులకు కూడా కొత్త బృందంలో చోటు కల్పించింది. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కొత్త బృందంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమించారు. మాజీ పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత రామ్ మాధవ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్, డి. పురందేశ్వరి, భారతి పవార్, తారిఖ్ మన్సూర్ తదితరులకు జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు.

మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తం ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులను నియమించగా, సతీశ్ పూనియా, సంజయ్ భాటియా, బిప్లబ్ దేబ్, సునీల్ బన్సల్, వినోద్ తావ్డే, గజేంద్ర పటేల్, హరీశ్ ద్వివేది తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సీనియర్ నేత బీఎల్ సంతోష్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా కొనసాగించారు. శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగత వ్యవహారాలు)గా నియమించారు.

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించడం కొత్త టీమ్‌లో అత్యంత కీలకమైన మార్పుల్లో ఒకటిగా నిలిచింది. బీజేపీ పాటిస్తున్న ‘ఒక వ్యక్తి.. ఒక పదవి’ విధానం నేపథ్యంలో గోయల్ కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతారా? అనే చర్చకు ఈ నియామకం దారితీసే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు అనిల్ బలూనీని పార్టీ జాతీయ మీడియా చీఫ్‌గా కొనసాగించారు. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తరుణ్ చుగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జిగా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్, రాధామోహన్ అగర్వాల్‌లకు కొత్త జాబితాలో చోటు దక్కలేదు.

కొత్త జాతీయ బృందంపై గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయనకు స్థానం లభించలేదు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాన్ ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‌కు కూడా కొత్త జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు.

వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన నేతలకు కొత్త బృందంలో గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఎన్నికలకు ముందే పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్నికల సమరానికి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే ప్రయత్నంగా తాజా పునర్వ్యవస్థీకరణను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

Satyam News

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News

ఐఏఎఫ్‌కు త్వరలో 5 తేజస్ మార్క్–1ఏ యుద్ధవిమానాలు

Satyam News

బోటు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎంఎల్ఏ

Satyam News

Leave a Comment