శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ పూజా మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.
ఉదయం 8:00 గంటలకు ప్రధానాలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీకృష్ణ భగవానునికి విశేష పూజలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మరియు ఆలయ స్థానాచార్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఆలయ చిన్న రాజగోపురం సమీపంలో దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్ర గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పాల్గొని గోమాతకు పసుపు-కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోవులకు స్వయంగా గ్రాసం తినిపించి ఆశీస్సులు అందుకున్నారు.
సనాతన ధర్మంలో గోసంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, శ్రీకృష్ణావతార విశిష్టతను చాటుతూ ప్రతి ఒక్కరూ గోసేవను కర్తవ్యంగా భావించాలని ఈ సందర్భంగా ఈవో పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమాలలో స్థానాచార్యులు పాల్గొన్నారు.
