విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, సమగ్రంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణపై జరిగిన నాలుగో సమన్వయ సమావేశంలోఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణ, దర్శన ఏర్పాట్లు, ప్రసాదం, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్, భద్రత, క్యూలైన్ నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు ఎంపీ తెలిపారు.
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, ప్రతిరోజూ సగటున 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని కేశినేని చిన్ని తెలిపారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు
భక్తుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉత్సవాల ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ తెలిపారు. భక్తులు ఎక్కువసేపు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్లను క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శన మార్గాలు, క్యూలైన్లు, వెయిటింగ్ ఏరియాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రసాదం కేంద్రాలు, వైద్య కేంద్రాలు తదితర వివరాలు సులభంగా తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు.
వెయిటింగ్ ఏరియాల్లో LED స్క్రీన్లు
భక్తులు వెయిటింగ్ ఏరియాల్లో వేచి ఉండే సమయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు LED స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ తెలిపారు.
దీంతో భక్తులు వేచి ఉండే సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ గడపవచ్చని చెప్పారు.
అమ్మవారి లడ్డు ప్రసాదం విషయంలో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదని సమావేశంలో స్పష్టంగా నిర్ణయించామని కేశినేని చిన్ని తెలిపారు.
ప్రసాదం తయారీ, నాణ్యత, నిల్వ, పంపిణీ వంటి ప్రతి దశలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో ప్రసాదం కోసం భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ప్రసాదం ఏటీఎంల ఏర్పాటుపై పరిశీలన
భక్తులకు ప్రసాదం సులభంగా అందేలా ప్రసాదం ఏటీఎంల ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఎంపీ తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రసాదం పంపిణీ కేంద్రాలను క్రమబద్ధీకరించడంతో పాటు, ఆధునిక విధానాలను ఉపయోగించి ప్రసాదం అందించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
అదే విధంగా ఆధునిక ప్రసాదాల తయారీ విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ఉత్సవాల సమయంలో అవసరమైన ప్రాంతాల్లో తాగునీరు, వేడిపాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతామని ఎంపీ తెలిపారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడకుండా వెయిటింగ్ ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రతి ముఖ్య ప్రాంతంలో వైద్య సిబ్బంది
భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో వైద్య సేవలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని కేశినేని చిన్ని తెలిపారు. వైద్య సిబ్బంది, అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు, అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు వెంటనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
AI ఆధారిత నిఘా వ్యవస్థ
ఈసారి దసరా ఉత్సవాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించనున్నామని ఎంపీ తెలిపారు. AI ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి భక్తుల రద్దీ, క్యూలైన్ల పరిస్థితి, వివిధ ప్రాంతాల్లో ఏర్పడే రద్దీ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రద్దీ పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట మార్గాలను మార్చడం, అదనపు సిబ్బందిని మోహరించడం వంటి చర్యలు చేపట్టేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.
భక్తులు ఎక్కువసేపు క్యూలైన్లలో వేచి ఉండకుండా చూడటం ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
క్యూలైన్లలో రద్దీని తగ్గించడంతో పాటు, భక్తులకు ఏ మార్గంలో వెళ్లాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఏ ప్రాంతంలో ఏ సదుపాయం ఉంది అనే విషయాలపై స్పష్టమైన సమాచారం అందేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
