ప్రపంచంహోమ్

భారత్ చైనా లపై సుంకాలు పెంచేందుకు మళ్లీ ట్రంప్ సిద్ధం

#DonaldTrump

గత హామీలను మరచి మళ్లీ భారత్ పై సుంకాలు పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ సూచనప్రాయంగా వెల్లడించింది. విదేశీ పారిశ్రామిక రంగాలకు ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలపై అమెరికా చేపట్టిన దర్యాప్తు ఫలితాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉందని ఆ కథనం పేర్కొంది. ఈ దర్యాప్తు ఫలితంగా చైనాపై కూడా అత్యధిక సుంకాలు విధించే అవకాశమున్నట్లు తెలిపింది.

అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఈ ఏడాది మార్చిలో 16 దేశాలు, ఆర్థిక వ్యవస్థలపై దర్యాప్తు ప్రారంభించింది. ఆయా దేశాల ప్రభుత్వాలు తమ పారిశ్రామిక సంస్థలకు అందిస్తున్న సబ్సిడీలు అమెరికా కంపెనీలకు అన్యాయమైన పోటీని సృష్టిస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం ఈ విచారణలు చేపట్టారు. ఈ నిబంధన ప్రకారం అన్యాయమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తున్న దేశాలపై సుంకాలు విధించడం లేదా ఇతర శిక్షాత్మక చర్యలు తీసుకునే అధికారం అమెరికా వాణిజ్య ప్రతినిధికి ఉంటుంది.

చైనా, యూరోపియన్ యూనియన్, భారత్, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో దేశాలు ఈ దర్యాప్తులో ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు తైవాన్, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, కంబోడియా, సింగపూర్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్, నార్వే దేశాలపైనా విచారణ కొనసాగుతోంది.

నిరంతర వాణిజ్య మిగులు నమోదు కావడం, వివిధ దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం అవసరానికి మించి ఉండటం,  వినియోగంలో లేని ఉత్పత్తి సామర్థ్యాలు ఉండటం వంటి అంశాల ఆధారంగా ఈ దర్యాప్తు చేపడుతున్నట్లు జేమీసన్ గ్రీర్ గతంలో వెల్లడించారు. ఈ పరిణామాలు అమెరికా తయారీ రంగంపై ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది జూలైలో ఇదే సెక్షన్ 301 నిబంధన కింద భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా అదనంగా 10 శాతం సుంకాన్ని విధించింది. భారత్‌తో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఇటీవల కీలక హామీ ఇచ్చినట్లు భారత ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కు సుంకాల విషయంలో తులనాత్మక ప్రయోజనం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో తొలి విడత చర్చలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడత ఒప్పందంతో పాటు సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పైనా ఒకేసారి చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికా చేపట్టిన దర్యాప్తు ఫలితాలు ఈ చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

హరీష్ రావు సోదరుడిపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు

Satyam News

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాట భేరి

Satyam News

ఎంపీపీలు, జెడ్పీటీసీల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ

Satyam News

జగన్‌ గ్రాఫ్‌ డౌన్‌…. వైసీపీ వైఫల్యమా..? చంద్రబాబు చాణక్యమా..??

Satyam News

దేశంలో అతిపెద్ద ఎక్స్‌పోగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’

Satyam News

జూలై 16 నుంచి కులవృత్తుల మేళా

Satyam News

Leave a Comment