హైదరాబాద్హోమ్

గుండె లోతుల్లోంచి రాసే కవిత్వానికి ప్రత్యామ్నాయం లేదు

#HarishRao

బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మంజీరా రచయితల సంఘం 40 ఏళ్ల మహాసభకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంజీరా రచయితల సంఘంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సంస్థ 40 ఏళ్ల ప్రస్థానాన్ని కొనియాడారు.

మంజీరా రచయితల సంఘంతో తనకు రెండు దశాబ్దాలకు పైగా సన్నిహిత అనుబంధం ఉందని హరీశ్ రావు తెలిపారు. ఒక సంస్థను 40 ఏళ్ల పాటు కొనసాగించడం కత్తిమీద సాములాంటిదని అన్నారు. ప్రభుత్వాల ఒత్తిళ్లు, ఆకాశరామన్న లేఖల బెదిరింపులు, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారుల హెచ్చరికలు వచ్చినా సంఘం వెనక్కి తగ్గలేదన్నారు. రామలింగన్న వంటి వారిని టాడా చట్టం కింద జైలులో పెట్టినా భయపడకుండా నిలబడిన గొప్ప చరిత్ర మంజీరా రచయితల సంఘానికి ఉందని పేర్కొన్నారు.

మంజీరా రచయితల సంఘం కేవలం పుస్తకాలు, కవిత్వానికే పరిమితం కాలేదని హరీశ్ రావు అన్నారు. 1992 నాటి మద్యపాన నిషేధ ఉద్యమం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, గుట్కా నిషేధం వంటి అనేక ప్రజా, సామాజిక సమస్యలపై సంస్థ పోరాటం చేసిందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో తెలంగాణలో కవులు, మేధావులు లేరంటూ చిన్నచూపు చూసిన వారికి తెలంగాణ రచయితల వేదిక ద్వారా నందిని సిద్ధారెడ్డి గట్టి సమాధానం ఇచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. ‘నాగేటి సాలల్లో పాట’, అమరులకు జోహార్లు అర్పించే పాటలు తెలంగాణ ఉద్యమంలో చరిత్ర సృష్టించాయని అన్నారు.

కామారెడ్డి ప్రిన్సిపాల్‌గా వచ్చిన పదోన్నతిని కూడా నందిని సిద్ధారెడ్డి వదులుకుని సిద్దిపేట మట్టి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం లెక్చరర్‌గానే కొనసాగారని హరీశ్ రావు తెలిపారు. ముక్కుసూటిగా మాట్లాడే సిద్ధారెడ్డి, ముఖ్యమంత్రి ఆఫర్ చేసిన కోటి రూపాయలను కూడా తిరస్కరించి తన నిబద్ధతను చాటుకున్నారని చెప్పారు.

ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఎన్నో సస్పెన్షన్ నోటీసులను లెక్కచేయకుండా దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని హరీశ్ రావు అన్నారు. తన రాజకీయ పరిణతి పెరగడానికి, తన భాష, ఉపన్యాస శైలి మెరుగుపడటానికి నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ వంటి వారి కృషి ఎంతో దోహదపడిందని తెలిపారు.

సకల జనుల సమ్మెతో దేశ రాజకీయాలను, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిన 41 రోజుల చారిత్రక ఘట్టం వెనుక దేవీప్రసాద్ వ్యూహం, ఆయన ప్రధాన కార్యదర్శిగా పోషించిన పాత్ర ఎంతో కీలకమని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంజీరా నదిలో చుక్క నీటిని వినియోగించుకోవాలన్నా, కనీసం చెక్‌డ్యామ్ నిర్మించాలన్నా ఆంక్షలు ఉండేవని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంజీరా నదిపై పదుల సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు నిర్మించి దానిని జీవనదిగా మార్చారని తెలిపారు. ప్రస్తుతం సింగూరు జలాలు మెదక్ జిల్లాలో గలగలా పారుతున్నాయని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రద్దు చేసిన సాహిత్య అకాడమీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పునరుద్ధరించిందని హరీశ్ రావు తెలిపారు. నందిని సిద్ధారెడ్డిని తొలి చైర్మన్‌గా నియమించి ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా సాహిత్య అకాడమీకి చైర్మన్‌ను నియమించలేదని, దీంతో అకాడమీ కార్యకలాపాలు నిలిచిపోయాయని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బతుకమ్మ, బోనాలకు రాష్ట్ర పండుగలుగా గుర్తింపు లభించిందని హరీశ్ రావు తెలిపారు. జయశంకర్ సార్, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య వంటి మహనీయులకు తగిన గౌరవం కేసీఆర్ పాలనలోనే దక్కిందన్నారు. సుమారు 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి గౌరవించుకున్నామని చెప్పారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలపై సెల్‌ఫోన్ల ప్రభావం పెరుగుతోందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉయ్యాలలో ఊగాల్సిన పిల్లలు ఫోన్లలో ఊగుతున్నారని, చందమామను చూపిస్తూ అన్నం తినిపించే రోజులు పోయి సెల్‌ఫోన్ చూపిస్తూ పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనివల్ల పుస్తక పఠనం బాగా తగ్గిపోతోందని పేర్కొన్నారు.

పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు అన్నారు. సమాజంలో సాహిత్యం, పుస్తకాలు, రచయితల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ మంజీరా రచయితల సంఘం మరింతకాలం ప్రజా, సామాజిక సమస్యలపై తన గొంతును వినిపించాలని ఆకాంక్షించారు.

Related posts

బీసీ నాయకుడి కాళ్లు విరగ్గొట్టిన వైసీపీ కార్యకర్తలు!

Satyam News

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మెలిక వెనక…. అసలు కారణం ఇదే!

Satyam News

విశిష్టమైన మాసం శ్రావణ మాసం

Satyam News

రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Satyam News

హక్కుల సాధనకు టీచర్స్ ఫోరమ్ దీక్ష

Satyam News

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News

Leave a Comment