ప్రత్యేకంహోమ్

పోలింగ్ రోజు హింసాత్మక సంఘటనలకు వైసీపీ కుట్ర?

#Vote

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం పన్నుతున్నదా? మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలోనూ, పులివెందుల ప్రాంతంలోనూ పరిస్థితి ఎలా ఉండబోతున్నది? అనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, అన్ని జిల్లా ప్రాదేశిక, మండల ప్రాదేశిక నియోజకవర్గాలలో పోటీకి దిగాల్సిందేనని, ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలిచ్చారు.

అయితే ఆయన ఆదేశాలకు భిన్నంగా రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కాడి కింద పడేశారు. తెలుగుదేశం కూటమి పార్టీల అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై తీవ్రంగా మదనపడుతున్న వైసీపీ అగ్రనేతలు స్థానికంగా ఉన్న నాయకులపై తీవ్ర వత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు. అయితే జగన్ నుంచి ఎంత వత్తిడి వస్తున్నా కూడా స్థానికంగా ఉన్న నాయకులు ముందుకు రాని విచిత్ర పరిస్థితి నెలకొని ఉన్నది.

చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము పోటీలో ఉండేందుకే విముఖత చూపించారు. కొన్ని చోట్ల అయితే బలవంతంగా పోటీలో ఉండేలా చేసినా కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరీ వారు పోటీ నుంచి ఉప సంహరించుకున్నారు. ఈ దశలో పరువు నిలబెట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతున్నది.

ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అడ్డంకులు సృష్టించడంతో బాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమనే అంశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కడప మునిసిపల్ కార్పొరేషన్, పులివెందుల మునిసిపాలిటీలలో పోలింగ్ నాడు తీవ్ర సంఘటనలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

కడప, పులివెందులలో జరపబోయే సంఘటనలకు ముందుగానే రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ‘‘శాంతి భద్రతల విఘాతానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరుగుతున్నది’’ అంటూ జగన్ చెబుతున్నారు. అంటే తాము చేయబోతున్న పనులను ముందుగానే తెలుగుదేశం కూటమి పార్టీలకు ఆపాదించే విధంగా ప్లాన్ చేశారని అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల, కడప నగరం, కమలాపురం, మైదుకూరు, అలాగే అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా నామినేషన్ల సమయంలోనే వార్తల్లోకి వచ్చాయి.

హింసాత్మక సంఘటనల్లో వైసీపీ నేతల ప్రమేయం?

ఆయా ప్రాంతాల్లో జరిగిన అన్ని సంఘటనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలే ప్రముఖ పాత్ర పోషించారు. పులివెందులలో పోలీసులపై జరిగిన రాళ్లదాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు వై ఎస్ అవినాష్ రెడ్డి నేరుగా పాల్గొన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉన్నది. అదే విధంగా కడప నగరంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో వైసీపీ నాయకులు ప్రముఖ పాత్ర పోషించారు. కమలాపురంలో నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటనల్లో, మైదుకూరులో రాజకీయ వర్గాల మధ్య వివాదాల విషయంలో కూడా వైసీపీ నాయకుల పాత్ర నిర్ధారణ అయింది. రాయచోటిలో అభ్యర్థుల వాహనాలపై జరిగిన దాడులు, పంజాబ్ నుంచి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి హత్యకు కుట్రపన్ని తీసుకువచ్చిన షార్ప్ షూటర్లను పోలీసులు అరెస్టు చేయడం లాంటి సంఘటనల వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది.

అక్టోబర్ 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించిన ఘర్షణలు, దాడులు, నామినేషన్ పత్రాలను అడ్డుకోవడం వంటి 45  ఘటనలలో వైసీపీ నేతలే ఉన్నారు. కడప జిల్లాలో అక్టోబర్ 17న పలు చోట్ల జరిగిన ఘటనల్లో కత్తిపోట్లకు గురైనవారు, గాయపడినవారు ఉన్నారు. వీరంతా కూటమి పార్టీలకు చెందిన వారేనని పోలీసులు కూడా స్పష్టం చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదన్న సమాచారం రావడంతో కడప జిల్లా పోలీసు అధికారులు భారీ ఎత్తున రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

Related posts

నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం

Satyam News

విద్యార్ధుల నిరసనలపై ఆదేశాలు: అంతలోనే రాజీ?

Satyam News

శాసన మండలిలో కాఫీ రగడ!

Satyam News

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

Satyam News

తిరుమలలో నెయ్యి కల్తీతో లడ్డూ జిహాద్‌..?

Satyam News

ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు

Satyam News

Leave a Comment