విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మూడు ఎకనమిక్ రీజియన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు ప్రాంతాల్లో అమలు చేయనున్న ప్రణాళికలు, ఇప్పటికే ప్రారంభించిన పనులు, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు.
పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మూడు ఆర్థిక ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా మొత్తం 167 అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో ఇప్పటికే 64 పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాంత అభివృద్ధికి వైజాగ్ బే సిటీని యాంకర్ ప్రాజెక్టుగా గుర్తించారు. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌లను అభివృద్ధి చేయనున్నారు. విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడలో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుతో పాటు పోర్టుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
తీర ప్రాంత అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. కోనసీమ బ్యాక్ వాటర్స్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు అరకులోయ, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో పర్యావరణహిత పర్యాటక ప్రాజెక్టులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. తద్వారా పర్యాటక రంగంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖకు కొత్తగా 15 నుంచి 20 ఐటీ సంస్థలను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల హామీని కార్యరూపంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
తిరుపతి ఎకనమిక్ రీజియన్‌ను బహుళ రంగాల పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వ్యవసాయ, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధన, విమానయాన, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం, పర్యాటకం, విజ్ఞాన ఆధారిత పరిశ్రమలకు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 66 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు తిరుపతి ఆర్థిక ప్రాంతం పరిధిలోనే ఉండటం విశేషం.
రాయలసీమను హార్టికల్చర్ హబ్ అభివృద్ధిలో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్, మాంసం, పౌల్ట్రీ పరిశ్రమలు, ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్, టెర్మినల్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి ఆర్థిక ప్రాంత పరిధిలోని 14 పట్టణాలను వాటి భౌగోళిక, పారిశ్రామిక అనుకూలతలకు అనుగుణంగా వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అదే విధంగా అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధికి సంబంధించి మొత్తం 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధి, రవాణా, లాజిస్టిక్స్ రంగాలకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా సూర్యలంక, ఓడరేవు, రామాపురం, చినగంజాం, నిజాంపట్నం, దిండి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పర్యాటక పెట్టుబడులను ఆకర్షించనున్నారు.
