బాలివుడ్ హీరోయిన్ దిశా పటానీకి భద్రత పెంచారు. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పుల ఘటన నేపథ్యంలో, నటి దిశా పటానీ తండ్రి, విశ్రాంత డీఎస్పీ జగదీశ్ సింగ్ పటానీ నివాసం వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
బరేలీ నగరంలోని సర్కిల్ ఆఫీసర్ (సిటీ-1) ఆశుతోష్ శివమ్ పటానీ నివాసాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఇంటి లోపల, బయట ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. సోమవారం కూడా అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం నివాసం వద్ద నిరంతరం పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ నిఘాను పెంచారు.
జగదీశ్ సింగ్ పటానీతో ఆశుతోష్ శివమ్ మాట్లాడి భద్రతా చర్యల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. గత ఏడాది సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జగదీశ్ సింగ్ పటానీ నివాసంపై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 11న ఒక రౌండు కాల్పులు జరగగా, మరుసటి రోజు 10 నుంచి 12 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత లారెన్స్ బిష్ణోయ్ ముఠా ప్రమేయంపై విచారణ చేపట్టారు. అనంతరం రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ ముఠాల పేర్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో కీలక పరిణామంగా 2025 సెప్టెంబర్ 17న ఉత్తరప్రదేశ్ ప్రత్యేక కార్యాచరణ దళం, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సంయుక్తంగా ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్ర అలియాస్ కుల్లు, అరుణ్‌లు హతమయ్యారు. పటానీ నివాసంపై జరిగిన కాల్పుల ఘటనలో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు.
తొలిరోజు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు బాల నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో మొత్తం ఆరుగురు అనుమానితులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నలుగురు నిందితులపై అభియోగపత్రం దాఖలు చేశారు. ఇద్దరు నిందితులు పోలీసుల ఆపరేషన్‌లో మరణించగా, బాల నిందితులను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరో ఇద్దరు నిందితులు బరేలీ జిల్లా జైలులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటానీ నివాసం వద్ద భద్రతను క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్లు బరేలీ పోలీసు అధికారులు తెలిపారు.
