ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ హరీశ్ రావు ఆరోపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాకపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బందికి 18 నెలలుగా వేతనాలు అందడం లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. నెలల తరబడి జీతాలు లేకుండా సిబ్బంది, వారి కుటుంబాలు ఎలా జీవించాలని ప్రశ్నించారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలన్నారు. ప్రతి నెల 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేటకు సంబంధించిన దాదాపు రూ.24 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు.
నిధులు విడుదల కాకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ, రోగుల సంరక్షణ, మందుల సరఫరా, వైద్య పరికరాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది జీతాలు, మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు, ఆసుపత్రుల నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిందని, అయితే ఆ హామీ ప్రకటనలకే పరిమితమైందని హరీశ్ రావు విమర్శించారు. ఆరోగ్యశ్రీ కవరేజీ పెంచామని చెప్పుకుంటూనే మరోవైపు ఈ వ్యవస్థను రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
బకాయిలు పేరుకుపోయి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడమే ఆసుపత్రులకు భారంగా మారితే చివరకు నష్టపోయేది పేద రోగులేనని అన్నారు. పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్యశ్రీకి నిధుల కొరత ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య ఎలాంటి తేడా చూపకుండా సీనియారిటీ, ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని హరీశ్ రావు కోరారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది జీతాలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే చర్యలను నిలిపివేసి, పేదల ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడాలని హరీశ్ రావు కోరారు.
