విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ గెలుపు లాంఛనంగానే కనిపిస్తున్నది. ఇప్పుడు ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందనే అంశంపైనే చర్చ నడుస్తున్నది.
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇటీవల చేయించిన సర్వేలో జనసేన తరపున పోటీ చేస్తున్న కూటమి అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణ కు మూడు లక్షలకు పైచిలుకు మెజారిటీ వస్తుందని తేలినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. నిన్నమొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరి ఆ పార్టీ తరపున మేయర్ అభ్యర్ధిగా పోటీ చేయడమే ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చర్చ జరుగుతున్నది. విజయవాడపై ఆశలు పెట్టుకున్న జగన్ రెడ్డి పార్టీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ వ్యూహాత్మక ఎత్తుగడతో షాక్ ఇచ్చారు.
అయితే అకస్మాత్తుగా మాజీ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు రంగంలో దిగడంతో జగన్ రెడ్డి ఆశలకు మళ్లీ మొలకలు వచ్చాయి. కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇది ఒక అవకాశంగా మలచుకోవచ్చుననే ఉద్దేశంతో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా జగన్ రెడ్డి పావులు కదపడం ప్రారంభించారు. తన పార్టీ సొంత అభ్యర్ధి అయిన రాయన భాగ్యలక్ష్మిని కాదని తన సైన్యం మొత్తాన్ని ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా పని చేయాలని జగన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి విజయవాడలో కమ్మ కాపు తగాదాలు మళ్లీ రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారు.
చేతులు ఎత్తేసిన వైసీపీ అభ్యర్ధి
ఏ బీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా కమ్యూనిస్టు పార్టీలను జగన్ రెడ్డి రంగంలో దించారు. కమ్యూనిస్టు పార్టీలు ఏ బీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా ప్రచారం ప్రారంభించడం, వైసీపీ అభ్యర్ధి భాగ్యలక్ష్మి తన వద్ద ఖర్చు చేసేందుకు డబ్బులేదని చేతులు ఎత్తేయడం ఒకే సారి జరిగాయి. దాంతో జగన్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లు జరుగుతున్నట్లు ఒక అంచనాకు వచ్చారు.
తనకు సంబంధించిన వ్యక్తులను విజయవాడ పంపించి జగన్ రెడ్డి ఏ బీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా ప్రచారం చేయించడం ప్రారంభించారు. జగన్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు నేరుగా విజయవాడ వచ్చి ఏ బీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైసీపీకి చెందిన కొందరు పెద్ద నాయకులు ఏ బీ వెంకటేశ్వరరావుకు ఆర్ధిక సహాయం చేసేందుకు కూడా ముందుకు వచ్చినట్లు చర్చ జరిగింది.
అయితే తెలుగుదేశం పార్టీ అభిమాన ఓటర్లు అంటే ముఖ్యంగా కమ్మ కులం ఓటర్ల నుంచి, ఆశించిన స్థాయిలో ఏబీవీకి మద్దతు లభించడం లేదని, మరి కొన్ని సామాజిక వర్గాల ఓట్లు కూడా ఆయనకు పూర్తిస్థాయిలో పడకపోవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిస్థితులలో ఏబీవీ కి సుమారు 70 వేల నుంఢీ 80 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని, వామపక్షాల నాయుకులే అంచనా వేస్తున్నారు. ఎనిమిది లక్షల ఓటర్లు ఉన్న విజయవాడలో ఈ లెక్కన వంగవీటి రాధాకి మూడు లక్షలకు పైగా మెజారిటీ సాధించే అవకాశం కనిపిస్తున్నది.
కమ్మ ఓటర్లు ఏ బీ వెంకటేశ్వరరావు వైపు మొగ్గు చూపడం లేదనే విషయం జగన్ రెడ్డికి ఇప్పటికే అర్ధం అయిందని అంటున్నారు. తాను వేసిన పాచికలు ఏవీ పారకపోవడంతో జగన్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఏ బీ వెంకటేశ్వరరావుకు రెండో స్థానం వచ్చి వైసీపీ అభ్యర్ధి భాగ్యలక్ష్మికి మూడో స్థానం వస్తే ఇక జగన్ ఆట విజయవాడలో పూర్తిగా కట్టించినట్లు అవుతుంది.
