సైబర్ మోసాలన్నింటిలో ఇది మరింత ప్రమాదకరమైనది. చాలా ఆకర్షణీయంగా, సాధారణ మోసాలకు మించి ఒక మెట్టు ముందున్నదిగా కనిపిస్తున్నా ఇందులో దిగితే ఇక అంతే సంగతులు…… “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరుతో ఒక అత్యాధునిక సైబర్ మోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వెలుగుచూసింది.
ముఖ్యంగా బిహార్‌లో ఈ మోసానికి పాల్పడుతున్న గ్యాంగ్‌లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకానికి ఎలాంటి చట్టబద్ధమైన లేదా వైద్యపరమైన ఆధారం లేదని, ఇది పూర్తిగా మోసమేనని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ మోసాన్ని నిర్వహిస్తున్న గ్యాంగ్‌కు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రధాన సూత్రధారి ఇంకా పరారీలోనే ఉన్నాడు.
ఈ మోసం ప్రధానంగా పురుషులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రకటనలు ఇచ్చి, సంతానం లేని మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చెల్లిస్తామని ఆశ చూపుతున్నారు. ఇందులో చిక్కుకున్నవారు ఆర్థిక నష్టం తో పాటు మానసిక వేధింపులకు కూడా గురవుతున్నారని అధికారులు స్పష్టం చేశారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ మోసం ఒకే విధమైన పద్ధతిలో కొనసాగుతోంది. ముందుగా తక్కువ శ్రమతో భారీ ఆదాయం వస్తుందంటూ ఆకర్షణీయమైన ఆన్‌లైన్ ప్రకటనలు ఇస్తారు. ఆ తర్వాత “రిజిస్ట్రేషన్ ఫీజు” పేరుతో మొదట సుమారు రూ.799 చెల్లించమని అడుగుతారు. ఆపై భద్రతా డిపాజిట్, కోర్టు పత్రాలు, జీఎస్టీ ఛార్జీలు అంటూ ఒక్కొక్కటిగా డబ్బులు వసూలు చేస్తారు.
ఈ క్రమంలో బాధితుల నుంచి ఆధార్, పాన్ వివరాలు, ఫోటోలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. తర్వాత నకిలీ కోర్టు నోటీసులు లేదా ప్రభుత్వ పత్రాలు చూపించి బెదిరింపులకు దిగుతారు. డబ్బు చెల్లింపులు ఆగిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ లేదా విషయం బయటపెడతామంటూ భయపెడతారు. వాస్తవానికి ఇందులో ఎలాంటి మహిళలు ఉండరు. చట్టబద్ధమైన ఒప్పందం ఉండదు, బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించరు అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
సైబర్ నేర విభాగం అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నిజమైన ఉద్యోగ సంస్థలు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు అడగవని ఒక అధికారి తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ఎదురైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
ఉద్యోగాల కోసం నిజమైన అవకాశాలను మాత్రమే ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఇండీడ్, నౌక్రీ డాట్‌కామ్ వంటి ధృవీకరించిన ఉద్యోగ వెబ్‌సైట్లను ఉపయోగించాలని, అలాగే గర్భిణీ మహిళలకు ఆర్థిక సహాయం అందించే ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన వంటి ప్రభుత్వ పథకాలను కేవలం అధికారిక మార్గాల ద్వారానే పొందాలని స్పష్టం చేశారు.
భద్రత పరంగా, ఉద్యోగాల పేరుతో ముందుగా డబ్బులు చెల్లించకూడదని, సంస్థల వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించాలని, తక్కువ పని చేసి ఎక్కువ డబ్బు వస్తుందనే ఆఫర్లను అనుమానంతో చూడాలని, అనుమానాస్పద ప్రకటనలను వెంటనే సైబర్ నేర విభాగానికి తెలియజేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
