ప్రపంచంహోమ్

ఇజ్రాయెల్ కంపెనీలతో భాగస్వామ్యం అన్యాయం

#MANUU

తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయెల్ కంపెనీలతో వ్యాపార, సాంకేతిక సంబంధాలు కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)లో ఆదివారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

టీ-హబ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయెల్ కంపెనీలతో వ్యాపార, సాంకేతిక సంబంధాలకు అవకాశం కల్పించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ సైనిక చర్యల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ కంపెనీలతో వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడం ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. పాలస్తీనాలో మారణహోమం, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యార్థిని స్వాలెహ్ అన్సారీ మాట్లాడుతూ తాము అంతర్జాతీయ భాగస్వామ్యాలకు వ్యతిరేకం కాదని, అయితే పాలస్తీనాలో అమాయక ప్రజల ప్రాణనష్టానికి, విధ్వంసానికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, కంపెనీలతో భాగస్వామ్యాలను మాత్రం వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తూ, మరోవైపు సాంకేతికత, వ్యాపారం పేరుతో ఇజ్రాయెల్‌కు సంబంధించిన సంస్థలకు వేదిక కల్పించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహమ్మద్ అలీ జౌహర్, మహాత్మా గాంధీ వంటి నాయకుల వారసత్వం కలిగిన భారతదేశం మారణహోమంలో భాగస్వామి కాకూడదని వ్యాఖ్యానించారు.

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తన వైఖరిని స్పష్టం చేయాలని స్వాలెహ్ అన్సారీ కోరారు. ఇతర రాష్ట్రాల్లో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం గురించి మాట్లాడే ఒవైసీ, పాలస్తీనాపై సైనిక చర్యలకు సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏమంటారని ప్రశ్నించారు.

ఎస్‌ఐఓ మానూ విభాగం అధ్యక్షుడు ఇక్ఱామ్ ఉల్ హక్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. మానవ హక్కుల సంస్థలు లేవనెత్తుతున్న తీవ్రమైన అభ్యంతరాలను విస్మరించరాదని అన్నారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి వైఖరి ఆమోదయోగ్యం కాదని, విద్యార్థులు, పౌర సమాజం ఈ అంశంపై తమ నిరసనను కొనసాగిస్తారని తెలిపారు.

స్టూడెంట్స్ కలెక్టివ్‌కు చెందిన ఇబ్రహీం జునైదీ మాట్లాడుతూ టీ-హబ్‌లో నిర్వహించే కార్యక్రమాలను కేవలం సాంకేతిక అభివృద్ధి, వ్యాపార అవకాశాల కోణంలో మాత్రమే చూడకూడదన్నారు. అందులో పాల్గొంటున్న కంపెనీల స్వరూపం, వాటి సాంకేతిక పరిజ్ఞానం, సైనిక కార్యకలాపాలు, మానవ హక్కుల ఉల్లంఘనలతో వాటికి ఏమైనా సంబంధాలున్నాయా అనే అంశాలను స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ కంపెనీల భాగస్వామ్యంతోపాటు డ్రిష్టి 2.0 వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ సాంకేతిక సహకారం విస్తరించడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మానూ విభాగం అధ్యక్షురాలు సారా తాలిబ్ ఖాన్ పాలస్తీనాలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమవుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకునే ముందు సమాజం తన నైతిక బాధ్యతను గుర్తించుకోవాలని అన్నారు. మానవత్వం, న్యాయం విషయంలో విద్యార్థులు ఎలాంటి రాజీని అంగీకరించరని స్పష్టం చేశారు.

Related posts

గల్ఫ్ యుద్ధ పరిస్థితిపై భారత్ ఆందోళన

Satyam News

గుడివాడ పోలీసు స్టేషన్ లో జగన్ బంధువు

Satyam News

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

Leave a Comment