కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ నాయకుడు గడ్డం వెంకట్ స్వామి (కాకా) జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వెంకట్ స్వామి ప్రజా సేవలను, ఆయన రాజకీయ జీవితాన్ని, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. లక్షలాది మంది ఈ ప్రపంచంలో జన్మిస్తారని, అయితే కొంతమంది మాత్రమే తమ జీవితంతో చరిత్రలో చెరగని ముద్ర వేస్తారని, అలాంటి మహనీయుల్లో వెంకట్ స్వామి ఒకరని పొన్నం ప్రభాకర్ అన్నారు.
నీతి, న్యాయానికి కట్టుబడి పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడిగా కాకా వెంకట్ స్వామిని కొనియాడారు. వెంకట్ స్వామితో కలిసి రాజకీయంగా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తాను రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో అనేక సందర్భాల్లో వెంకట్ స్వామి తనకు మార్గదర్శకత్వం వహించారని చెప్పారు. రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరించాలి, ప్రజల సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి, పేద ప్రజలకు ఎలా అండగా నిలవాలి అనే విషయాల్లో ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.
చిన్న ఆపద వచ్చినా దాన్ని తన ఆపదగా భావించి స్పందించే గొప్ప మనసున్న వ్యక్తి వెంకట్ స్వామి అని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక జీవితంలోనూ ఆయన ఆలోచనా విధానం, సేవా భావం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
తెలంగాణ సాధన వెంకట్ స్వామి జీవితంలో ఒక ముఖ్యమైన ఆకాంక్షగా ఉండేదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం ఎలా సాగాలి, ప్రజలను ఎలా చైతన్యపరచాలి, రాజకీయంగా అన్ని వర్గాలను ఎలా ఒప్పించాలి అనే అంశాల్లో వెంకట్ స్వామి ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు.
వెంకట్ స్వామి ఆశయాలకు అనుగుణంగా ఆయన కుటుంబం కూడా ప్రజా సేవలో కొనసాగడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కుమారుల్లో ఒకరు మంత్రిగా, మరొకరు శాసనసభ్యుడిగా, మనవడు ఎంపీగా ప్రజలకు సేవ చేయడం ఆయన ఆశయాలు కొనసాగుతున్నాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కాకా వెంకట్ స్వామి ఆలోచనా విధానాన్ని, సేవా స్ఫూర్తిని ఆయన అనుచరులు, అభిమానులు, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పేద ప్రజలకు న్యాయం చేయడం, అణగారిన వర్గాలకు అండగా నిలవడం ద్వారా మాత్రమే వెంకట్ స్వామికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు.
