కృష్ణహోమ్

కొత్తగా 12.23 లక్షల మందికి బీపీ.. 11.58 లక్షల మందికి షుగరు

#satyakumaryadav

రాష్ట్రంలో NCD 4.0 (Non-Communicable Diseases) ద్వారా కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు, 11,58,632 మందికి మధుమేహం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. నోటి క్యాన్సర్ లో 3,339,  రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 9,171 వెలుగు చూశాయి.

రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.85 కోట్ల మందికి బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార పరీక్షలు నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం బీపీతో ఉన్నవారు 59.63 లక్షలు, మధుమేహంతో ఉన్నవారు 48.95 లక్షల మంది ఉన్నారు.

ఈ  1,08,58,000 మందిలో  బీపీ+షుగర్ కలిగి ఉన్న వారు రాష్ట్రoలో 34 లక్షల మంది ఉన్నారు.  అలాగే 3,339 నోటి క్యాన్సర్, 5,832 రొమ్ము క్యాన్సర్, 3,597 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులను గుర్తించారు. సర్వే ఫలితాల నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కు కుటుంబ సంక్షేమ కమిషనర్, ఎన్‌హెచ్‌ఎం ఎండీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల సమర్పించారు.

14 నెలల పాటు సాగిన సర్వే

ఈ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నవంబర్ 10న సర్వే ముగిసింది. గ్రామ, వార్డు స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మధుమేహ పరీక్షలు నిర్వహించారు.

వేలి నుంచి రక్తం తీసి చక్కెర స్థాయిని పరీక్షించారు. రక్తంలో చక్కెర స్థాయి 140 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉన్నవారిని వైద్యాధికారుల వద్దకు పంపించారు. అక్కడ ఉపవాస సమయంలో, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించి, వైద్య పరిశీలన ద్వారా వ్యాధిని నిర్ధారించారు.

అలాగే రక్తపోటు పరీక్షలో బీపీ 140/90 ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువ ఉన్నవారిని వైద్యుని వద్దకు పంపించి, వైద్య పరిశీలన నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత మందులు అందించారు. క్యాన్సర్ కేసుల గుర్తింపులోనూ ప్రత్యేక పద్ధతులను అవలంబించారు.

సర్వే కోసం పెద్ద కసరత్తు

ఎన్‌సీడీ పరీక్షల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ వేదికల ద్వారా అమలు చేస్తున్నారు. ఆరోగ్య వివరాల నమోదు, కార్యక్రమ పర్యవేక్షణకు వీటిని వినియోగిస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు, వైద్యాధికారుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

ద్వితీయ స్థాయి వైద్యశాలల్లో ఎన్‌సీడీ యాప్‌, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లోని క్యాన్సర్ నివారణ విభాగాల్లో ప్రత్యేక వెబ్‌ పోర్టల్ పనిచేస్తోంది. కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పట్టికలను రూపొందిస్తున్నారు. ఆరోగ్య వివరాల నమోదు ముందు ఆధార్ ఓటీపీ లేదా వేలిముద్ర ద్వారా సదరు వ్యక్తులను నిర్ధారిస్తున్నారు.

40 వేల మంది ఆశా కార్యకర్తలకు, 22 వేల మందికి పైగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు, స్టాఫ్ నర్సులు, వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. 500 మందికి పైగా ఎన్‌సీడీ క్లినిక్‌ల సిబ్బందికి, ద్వితీయ స్థాయి ఆసుపత్రులకు చెందిన 550 మంది వైద్య నిపుణులకు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల క్యాన్సర్ నివారణ విభాగాలకు చెందిన 150 మంది నిపుణులకు కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

13.93 శాతo బీపీ, 11.45 శాతo మధుమేహo

రాష్ట్రoలో ఉన్న 18 ఏళ్లు దాటిన జనాభా లెక్కల (4.2 కోట్లు) ప్రకారం.. 13.93 శాతం మందికి అధిక రక్తపోటు, 11.45 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. జిల్లాల వారీగా తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలు బీపీ కేసుల్లో ముందున్నాయి. మధుమేహం కేసుల్లో తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, ఏలూరు జిల్లాలు ఉన్నాయి.

ఈ NCD-4.0 సర్వే ద్వారా మాత్రమే కొత్తగా గుర్తించిన బీపీ కేసుల సంఖ్యలో విశాఖపట్నం (78,017), పశ్చిమగోదావరి (68,802), తిరుపతి (65,504), తూర్పుగోదావరి (64,116), వైఎస్సార్ కడప (63,141) జిల్లాలు ముందున్నాయి. మధుమేహం కేసుల్లో విశాఖపట్నం (80,692), పశ్చిమగోదావరి (67,935), తిరుపతి (67,827), వైఎస్సార్ కడప (66,914), ప్రకాశం (61,415) జిల్లాలు ముందున్నాయి.

వయస్సుల వారీగా అధిక రక్తపోటు, మధుమేహం కేసుల వివరాలు

60 ఏళ్లు పైబడిన వారిలోనే అధికంగా బీపీ, మధుమేహం కేసులు ఉన్నాయి. అధిక రక్తపోటు కేసుల్లో 47.60 శాతం.. మధుమేహం కేసుల్లో 43.39 శాతం ఆ వయస్సు వారే ఉన్నారు. 50–59 ఏళ్ల వయస్సు వారిలోనూ ఈ రెండు వ్యాధుల కేసులు అధికంగా గుర్తించారు.

18–19 ఏళ్ల మధ్య

అధిక రక్తపోటు: 11,827 మంది (0.20 శాతం)

మధుమేహం: 10,360 మంది (0.21 శాతం)

20–29 ఏళ్లు

అధిక రక్తపోటు: 81,983 మంది (1.37 శాతం)

మధుమేహం: 75,431 మంది (1.54 శాతం)

30–39 ఏళ్లు

అధిక రక్తపోటు: 2,89,865 మంది (4.86 శాతం)

మధుమేహం: 2,86,680 మంది (5.86 శాతం)

40–49 ఏళ్లు

అధిక రక్తపోటు: 9,99,833 మంది (16.77 శాతం)

మధుమేహం: 9,22,583 మంది (18.84 శాతం)

50–59 ఏళ్లు

అధిక రక్తపోటు: 17,41,147 మంది (29.20 శాతం)

మధుమేహం: 14,76,353 మంది (30.16 శాతం)

60 ఏళ్లు, ఆపై వయస్సు

అధిక రక్తపోటు: 28,38,552 మంది (47.60 శాతం)

మధుమేహం: 21,24,428 మంది (43.39 శాతం)

క్యాన్సర్ అనుమానిత కేసుల నుంచి నిర్ధారణ వరకు

క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించిన 9.96 లక్షల నోటి క్యాన్సర్ అనుమానిత కేసులను వైద్యాధికారులు పరీక్షించారు. అనంతరం 23,009 మందిని పెద్ద ఆసుపత్రులకు పంపించారు. వీరిలో 3,339 కేసులు క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యాయి. రొమ్ము క్యాన్సర్ అనుమానిత కేసుల్లో 15,374 మంది మహిళలను వైద్యాధికారులు పెద్ద ఆసుపత్రులకు పంపగా, అక్కడ 5,832 కేసులు నిర్ధారణ అయ్యాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సంబంధించి 19,429 కేసులను వైద్యాధికారులు పరిశీలించి పెద్ద ఆసుపత్రులకు పంపించారు. వీరిలో 3,597 కేసులు నిర్ధారణ అయ్యాయి.

జీవనశైలి వ్యాధుల నియంత్రణకు ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి వ్యాధుల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, వాటి తీవ్రత పెరగకుండా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్ కేసులను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాధులు గుర్తించిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

శ్రీ కంచి కామకోటి పీఠం విద్యాసంస్థల అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

పోలింగ్ అధికారి హరిత మృతిపట్ల సీఎం చంద్రబాబు విచారం

Satyam News

రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలి

Satyam News

వచ్చే నెలలో పెళ్లి… నేడు ప్రమాదం లో మృతి

Satyam News

బలిజ భవన్‌ కల్యాణ మండపం ప్రారంబించిన మంత్రి నారాయణ

Satyam News

27న భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam News

Leave a Comment