ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. APSBCL డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన భారీ అవినీతిపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఈ కేసులో ఇప్పటికే APSBCL మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, వైసీపీ హయాంలో చక్రం తిప్పిన రాజ్ కెసిరెడ్డితోపాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్‌లను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దొరికిన ఒకే ఒక్క హవాలా నంబర్, దానికి సంబంధించిన ఆధారాలు టాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.
నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ED అధికారులకు ఊహించని ఆధారం చిక్కింది. కారుమూరి సునీల్ కుమార్ ఫోన్‌ను స్కానింగ్ చేయగా, అందులో ఓ కరెన్సీ నోటు ముక్క ఫొటో కనిపించింది. హవాలా మార్కెట్‌లో అత్యంత రహస్యంగా లావాదేవీలు జరపడానికి ఇలాంటి నోటు ముక్కలను టోకెన్లుగా వాడుతుంటారు.
ఓ నగరంలో ఏజెంట్‌కు నల్లధనం అప్పగించినప్పుడు వారు ఇచ్చే సగం నోటు ముక్క ఫొటోను మరో నగరంలోని వ్యక్తికి పంపిస్తారు. అక్కడ ఆ ఫొటోను చూపించి క్యాష్ కలెక్ట్ చేసుకుంటారు. ఈ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన తిరుగులేని సాక్ష్యం ఇప్పుడు ED చేతికి దొరకడంతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.195 కోట్ల విలువైన మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్‌పోర్టు సంస్థలకు కట్టబెట్టారు. ఈ సిగ్మా సంస్థ నుంచి వల్లు సందీప్‌కు చెందిన సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. ఈ రూట్ లోనే సిగ్మా నుంచి సుదర్శన్ కంపెనీకి, అక్కడ నుంచి సునీల్‌కుమార్ ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు చేరాయి. ఈ అక్రమ సొమ్మును సునీల్‌కుమార్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడబెట్టడమే కాకుండా, గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు ED బలంగా అనుమానిస్తోంది.
ఇప్పటివరకు కేవలం కాగితాలకే పరిమితమైన ఈ రూ.195 కోట్ల కుంభకోణానికి ఈ నోటు ముక్క ఫొటోతో బలమైన లింక్ దొరికినట్లయింది. ఈ స్కామ్ లోని సింహభాగం డబ్బు ఎటు మళ్లిందనేది ఈ ఒక్క ఆధారంతో తేలిపోనుంది. ఈ నోటు ముక్క ఫొటోను ఎవరికి పంపారనే కోణంలో నిందితులను ED అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం ED అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ విచారణ ముగిస్తే పెద్దల గుట్టు రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
