లడఖ్ ప్రాంతంలో జరిగే అన్యాయాలపై మాట్లాడుతుంటే తనను అడ్డుకుంటున్నారని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోపించారు. తాను స్థాపించిన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్ (హెచ్‌ఐఏఎల్) సంస్థను లక్ష్యంగా చేసుకుంటుననారని, తమ సంస్థ భూమి లీజు వ్యవహారాన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వ అనుకూల ప్రచార యంత్రాంగం తనపై విమర్శలు గుప్పిస్తోందని ఆయన శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.
భూమి లీజు ప్రక్రియలో జాప్యానికి సంబంధించి అధికారుల వైపునే లోపాలు ఉన్నట్లు తెలుస్తుందని ఆయన అన్నారు. లీజు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కోరుతూ ఐదు లిఖితపూర్వక విజ్ఞప్తులు సమర్పించామని, అధికారులను 15 సార్లు ప్రత్యక్షంగా కలిశామని, 30 సార్లు ఫోన్ ద్వారా సంప్రదించామని వెల్లడించారు.
మరోవైపు, వాంగ్‌చుక్‌కు చెందిన విద్యాసంస్థకు కేటాయించిన భూమి లీజును రద్దు చేయడాన్ని లడఖ్ పరిపాలన సమర్థించింది. చట్టాన్ని పట్టించుకోకపోవడం, నిర్ణీత గడువులోగా అవసరమైన చెల్లింపులు చేయకపోవడం, లీజు ఒప్పందాన్ని పూర్తి చేయకపోవడం వల్ల భూమి కేటాయింపు చట్టప్రకారమే రద్దయిందని పేర్కొంది.
జమ్మూ కశ్మీర్, లడఖ్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో లడఖ్ పరిపాలన ఈ విషయాలను వివరించింది. ఫ్యాంగ్ థాంగ్ ప్రాంతంలో హెచ్‌ఐఏఎల్‌కు 1,076 కనాల్స్ ఒక మర్లా భూమిని 40 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించినట్లు తెలిపింది. అయితే, కేటాయింపు జరిగిన ఏడాదిలోగా లీజు ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో పాటు తప్పనిసరిగా చెల్లించాల్సిన భూమి ప్రీమియాన్ని జమ చేయలేదని పేర్కొంది. ఈ కారణాలతో 2019 మే 5వ తేదీ నాటికే భూమి కేటాయింపు చట్టప్రకారం ముగిసిపోయిందని అఫిడవిట్‌లో వెల్లడించింది.
హెచ్‌ఐఏఎల్‌కు కేటాయించిన భూమి లీజును రద్దు చేస్తూ 2025 ఆగస్టు 21న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌కు సమాధానంగా లడఖ్ స్వయంప్రతిపత్తి కొండ ప్రాంతాల అభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ రోమిల్ సింగ్ డోంక్ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా లడఖ్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార యంత్రాంగం నిజాయితీ, సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తేలా ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. హెచ్‌ఐఏఎల్ లీజు ఒప్పందాన్ని పూర్తి చేయలేదని హైకోర్టుకు, జాతీయ మీడియాకు చెప్పే ముందు అధికారులు తమ శాఖ జారీ చేసిన ఉత్తరాలను చదవాలని ఆమె వ్యాఖ్యానించారు.
2018 మే 5న భూమి కేటాయించిన అనంతరం కేవలం 15 రోజుల్లోనే, అదే నెల 20న హెచ్‌ఐఏఎల్ లీజు కోసం దరఖాస్తు చేసుకుందని గీతాంజలి ఆంగ్మో తెలిపారు. ఆ తర్వాత 2020 మార్చిలో మరోసారి అధికారులకు లేఖ రాశామని చెప్పారు. అప్పట్లో లీజు విధానాన్ని పరిపాలన యంత్రాంగం ఖరారు చేయనందున ఒప్పందాన్ని అమలు చేయలేమని సంబంధిత సహాయ కమిషనర్ సమాధానమిచ్చారని వివరించారు.
2021 ఫిబ్రవరిలోనూ అధికారులు ఇదే కారణాన్ని పేర్కొన్నారని ఆమె తెలిపారు. ఈ జాప్యం ఇతర సంస్థలపైనా ప్రభావం చూపిందని అంగీకరించడంతో పాటు, తమ సంస్థ నిర్మాణ పనులను కొనసాగించేందుకు అనుమతించారని పేర్కొన్నారు. 2023 జూలైలో కూడా మరోసారి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద నాలుగు వేర్వేరు తేదీలకు సంబంధించిన ఉత్తరాలు, అధికారుల సంతకాలు, ముద్రలు ఉన్నాయని ఆమె అన్నారు.
ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించకుండా ఉంచిన అధికారులే ఇప్పుడు ఆ జాప్యానికి సంస్థను బాధ్యురాలిగా చూపడం ఏమిటని గీతాంజలి ఆంగ్మో ప్రశ్నించారు. అడ్డంకులను సృష్టించి, వాటిని తొలగించకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేసి, చివరకు పరిష్కారం కోరిన సంస్థపైనే నిందలు వేయడం ఎలాంటి పాలన అని నిలదీశారు. లడఖ్ ప్రజలకు కల్పిత కథనాలు కాకుండా సమర్థవంతమైన పాలన అవసరమని ఆమె పేర్కొన్నారు.
ఈ భూమి లీజు వ్యవహారంలో ఒకవైపు అధికారుల జాప్యమే ప్రధాన కారణమని వాంగ్‌చుక్, ఆయన భార్య ఆరోపిస్తుండగా, మరోవైపు నిర్ణీత గడువులోగా లీజు ప్రక్రియ పూర్తి చేయకపోవడం సంస్థ వైఫల్యమని లడఖ్ పరిపాలన వాదిస్తోంది. ఈ వివాదంపై తుది నిర్ణయం న్యాయస్థాన విచారణలో వెలువడాల్సి ఉంది.
