కృష్ణహోమ్

సాంకేతిక పోలీసింగ్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీ

#VangalapudiAnitha

నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్  విగ్రహం  సమీపంలోని డా. బిఆర్ అంబేద్కర్ కళా వేదిక లో నిర్వహించిన రిట్రీట్‌లో హోం మంత్రి అనిత  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీసు అధికారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ 2001లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పోలీసు సంస్కరణల రిట్రీట్ సంప్రదాయాన్ని 25 సంవత్సరాల అనంతరం అదే దూరదృష్టి, అదే సంస్కరణల స్ఫూర్తితో పునరుద్ధరించడం చారిత్రాత్మకమని హోంమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ కార్యాలయం, జిల్లా ఎస్పీలు, పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు చేస్తున్న సేవలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, వామపక్ష తీవ్రవాదం, మతకలహాలను గణనీయంగా అదుపులోకి తీసుకురాగలిగామని పేర్కొన్న హోంమంత్రి, ప్రస్తుతం సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని అన్నారు. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి, మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు నాలుగు శాతం తగ్గించగలిగామని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈగల్ (EAGLE)’ వ్యవస్థ ద్వారా ఎస్పీలు, పోలీసు అధికారులు సమన్వయంతో గంజాయి సాగు, అక్రమ రవాణాపై సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

112 అత్యవసర స్పందన వ్యవస్థ ద్వారా స్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించామని, పోలీసింగ్‌లో ‘గోల్డెన్ టైమ్’ అత్యంత కీలకమని హోంమంత్రి పేర్కొన్నారు. వేగవంతమైన స్పందన వల్ల నేరస్థులను త్వరగా అదుపులోకి తీసుకురావడంతో పాటు బాధితుల్లో భరోసా పెరుగుతుందని అన్నారు.

పోలీసు శాఖ బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ఇప్పటికే 6,000 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేశామని, భవిష్యత్తులో కూడా ప్రతి జాబ్ క్యాలెండర్‌లో కొత్త పోలీసు పోస్టులను భర్తీ చేస్తూ శాఖను మరింత బలోపేతం చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడానికి, నూతన తరహా నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ రెండు రోజుల రిట్రీట్‌లో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, రౌడీయిజం నిర్మూలన, ఫ్యాక్షన్ రాజకీయాల నియంత్రణ, వామపక్ష తీవ్రవాద నిర్మూలన, మతసామరస్య పరిరక్షణ వంటి ఆరు కీలక అంశాలపై వర్కింగ్ గ్రూపులు చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా రూపొందే సూచనలు రాష్ట్ర పోలీసింగ్‌కు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా మారనున్నాయని చెప్పారు.

రిట్రీట్ ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని, అధికారులు తమ వినూత్న ఆలోచనలు, సంస్కరణల ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా సమర్పించాలని హోంమంత్రి కోరారు.

“నేరం ఎంత ఆధునికమైనా… ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ దానికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. సాంకేతికత, వేగవంతమైన స్పందన, పారదర్శకత, ప్రజల విశ్వాసం ఆధారంగా ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ వ్యవస్థను నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలబెడతాం” అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా, రాబోయే 20 సంవత్సరాల సవాళ్లను ఎదుర్కొనే అత్యాధునిక పోలీసింగ్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమన్నారు. మారుతున్న నేరాల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని 10 కీలక అంశాలతో కూడిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు.

సాంప్రదాయ పోలీసింగ్‌కు బదులుగా డిజిటల్, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. నమోదైన కేసుల సంఖ్య కంటే, ముందుగానే నివారించిన నేరాలు, ప్రమాదాల ఆధారంగా పోలీస్ పనితీరును అంచనా వేసే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. విదేశాల నుంచి జరిగే సైబర్ మోసాలు, డీప్‌ఫేక్‌లు, అనామక సైబర్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ముందస్తు నిఘా వ్యవస్థలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రోన్ నిఘా, నిర్వహణ కోసం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భౌతిక అర్హతలతో పాటు కోడింగ్, క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతను పోలీస్ బలగాల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

అత్యవసర సేవల 112 కాల్ వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందించే వ్యవస్థను అభివృద్ధి చేయడం, పోలీస్–వైద్య–మహిళా సంక్షేమ శాఖల సమన్వయంతో గృహహింస, ఆత్మహత్యలు, బాలలపై నేరాల నివారణకు డిజిటల్ హెల్త్ అండ్ సేఫ్టీ గ్రిడ్, ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థలను వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఈ లక్ష్యాల సాధన కోసం 0–3 సంవత్సరాలు (స్వల్పకాలిక), 3–7 సంవత్సరాలు (మధ్యకాలిక), 7–20 సంవత్సరాలు (దీర్ఘకాలిక) దశలవారీ కార్యాచరణ ప్రణాళికతో ఏపీ పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.

Related posts

గొడవలు అల్లర్లు చేస్తే, ర్యాలీ చేస్తే రిమాండ్

Satyam News

జమ్మూ కాశ్మీర్ లో కనిపించిన భూమి

Satyam News

పాక్ లో భారీ వరదలు: 327 మంది మృతి

Satyam News

Lokesh Magic: కార్పొరేట్‌ను తలదన్నే ప్రభుత్వ స్కూల్స్!

Satyam News

ఆడుకుంటూనే… గుండెపోటుతో చిన్నారి….

Satyam News

ఓటర్ల జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి

Satyam News

Leave a Comment