వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
దాదాపు 30 ఏళ్లుగా అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. 1996లో శిలాఫలకం వేసిన ప్రాజెక్టును 2026లో ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. తాను 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, తాగునీరు అందించాలని కోరారని గుర్తు చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించేలా గత రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
నాడు ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని, దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా ఆశించిన స్థాయిలో నీరు రాలేదని చెప్పారు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందించాలని సంకల్పించుకున్నామని స్పష్టం చేశారు.
2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేవాళ్లమని చంద్రబాబు అన్నారు. అయితే గత పాలకుల హయాంలో చోటుచేసుకున్న పరిణామాలు, డ్రామాల కారణంగా ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించడంతో పాటు శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతాలకు నీటిని అందించే అవకాశం ఉంటుందని వివరించారు.
గంగా, గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తాను ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఐదు నదులను అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యలు పరిష్కారమవుతాయని, తద్వారా దేశానికి కూడా నీటి సమస్య నుంచి ఉపశమనం లభించి నీటి భద్రత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు చెప్పారు. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సెప్టెంబర్‌లో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని చంద్రబాబు కోరారు.
