మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌లతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
తాము రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించినప్పటి నుండి బీఆర్‌ఎస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని, ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని కవిత విమర్శించారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీలు గెలిచిన బీఆర్‌ఎస్, ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితం కావడంపై ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
మున్సిపల్ ఎన్నికలే బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తుకు తొలిమెట్టుగా కనిపిస్తున్నాయని, ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతలు బీజేపీకి పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలో సీపీఐకి మద్దతు ఇవ్వడం ద్వారా, గతంలో కేసీఆర్‌పై ఆ పార్టీ చేసిన ఆరోపణలను బీఆర్‌ఎస్ అంగీకరించినట్లయిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, తమ అభ్యర్థులు 40 స్థానాల్లో విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని కవిత తెలిపారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తున్నా తమ అభ్యర్థులు లొంగడం లేదని చెప్పారు.
గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని, ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేశారని ఆరోపించారు. రైతులకు ఇస్తామన్న బోనస్ నిధులపై దృష్టి పెట్టకుండా, అధికార అహంతో వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఫార్వర్డ్ బ్లాక్ నేత అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్‌లో బీజేపీ నైతిక విలువలను వదిలేసిందని, తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. డబ్బు ఖర్చు చేయకుండానే ప్రజలు తమకు 40 సీట్లు ఇచ్చారని, భవిష్యత్తులోనూ జాగృతితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
రామగుండం ఎమ్మెల్యే తమ అభ్యర్థులపై గుండాయిజం చేస్తున్నారని రియాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న సింగరేణి ఎన్నికల్లోనూ జాగృతి, హెచ్‌ఎంఎస్, ఫార్వర్డ్ బ్లాక్ కలిసికట్టుగా పోరాడి కార్మికుల హక్కులను కాపాడతాయని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు.
