కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపైనా ఉందనే డిమాండ్ సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యక్తమవుతోంది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థాపకులు వెలగపూడి ప్రకాశ్ రావు మాట్లాడుతూ, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెచ్చిన జీవో 21 ద్వారా పాత చర్చిల పునరుద్ధరణకు, కొత్త చర్చిల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించారని ఆరోపించారు. హిందూ దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని చర్చిలకు మళ్లించారని, దానిపై తాను స్వయంగా న్యాయపోరాటం చేసి కోర్టు ద్వారా ఆ జీవోపై స్టే తీసుకువచ్చానని ఆయన గుర్తుచేశారు.
అలాగే తిరుపతి స్థానిక మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ప్రజాప్రతినిధులను గట్టిగా నిలదీయాలని వెలగపూడి ప్రకాశ్ రావు పిలుపునిచ్చారు. తిరుపతిలో అక్రమంగా నిర్మించిన చర్చిలు, మసీదులను వెంటనే తొలగిస్తామని తెగేసి చెప్పే నాయకులకే ఓటేస్తామని ఓటర్లు స్పష్టంగా అడిగే ధైర్యం చూపాలన్నారు. తిరుపతి శ్రీవారి క్షేత్రం యావత్ హిందూ సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడి పవిత్రతను కాపాడుకోవాలని కోరడం ప్రతి హిందువు హక్కు అని వ్యాఖ్యానించారు.
మతమార్పిడులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగే అక్రమ నిర్మాణాల వల్ల నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని భక్తులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తిభావంతో నిండి ఉండే దివ్య క్షేత్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే లౌకికత్వం పేరిట పాలకులు మౌనం వహిస్తున్నారని, ఇది తిరుపతి పవిత్రతకే తీవ్ర ముప్పుగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతికి పట్టిన సంకెళ్లను తెంచాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకాశ్ రావు పేర్కొన్నారు. ఓటు హక్కును ఆయుధంగా మలుచుకుని, అనధికార ప్రార్థనా మందిరాల తొలగింపునకు ఒత్తిడి తెచ్చేలా తిరుపతి ప్రజలు, ఓటర్లు ఒక్కటై తమ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని రక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
