విజయవాడలో నిర్వహించిన స్వచ్చథాన్‌కు మంచి స్పందన లభించినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘు రామరాజులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్చ ఆంధ్ర’ ఉద్యమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. విజయవాడలో శుక్రవారం స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని, స్వచ్చథాన్ కు మంచి స్పందన లభించిందని తెలిపారు. 22 రాష్ట్రాల నుంచి పది వేల మందిపైగా మారథాన్ లో పాల్గొన్నారన్నారు.
విజయవాడ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందం కలిగించిందని చెప్పారు. ఇంతమంది భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛథాన్ సక్సెస్ అవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా అభినందించారని సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవ్ ను కూడా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు.
ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో తాము, ప్రజాప్రతినిధులు సమిష్టి గా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రపతి ముర్ము ఈ విజయవాడ ఉత్సవ్ కు రాబోతున్నట్లు తెలిపారు. అనేక రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ వెళ్లారన్నారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ కు లక్షలాదిమంది తరలి వచ్చి ఆనందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనేకమంది, అనేక సంస్థ లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయూతను అందిస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది కంటే ఈసారి విభిన్నంగా, విశేషంగా ఉండేలా కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే అతిధులు, రాష్ట్ర ప్రజలు దసరా వైభవం, విజయవాడ ఉత్సవ్ గురించే మాట్లాడుకోవాలన్నారు. గత ఏడాది మూడు వేలమందితో చేసిన కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిందని, ఈ ఏడాది ఐదు వేల మంది కళాకారులతో కార్నివాల్ ఉండబోతుందని వివరించారు.
పున్నమి ఘాట్ వద్ద, ఎంబీకే స్టేడియం, సిద్దార్ధ ఫార్మసీ కళాశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరస్సు మేళా కూడా నిర్వహిస్తారన్నారు. డ్రోన్ షోస్, క్రాకర్ షోస్, లేజర్ షోస్ కూడా నిర్వహిస్తారని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యువతకు అనేక రకాల పోటీలు నిర్వహిస్తారని చెప్పారు. స్వచ్చథాన్ విజయవంతం చేసిన విధంగా విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేయాలని ప్రజలను పట్టాభిరామ్ కోరారు.
