కృష్ణహోమ్

నేషనల్ సరస్ మేళాకు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం

#NTRDistrict

విజయవాడలోని పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నేషనల్ సరస్ మేళా–2026 కు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలు పెరిగేలా సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు.

బుధవారం పున్నమి ఘాట్‌లోని సరస్ మేళా ప్రాంగణంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం సరస్ మేళా లో నిర్వహించారు. ఈ సందర్భంగా మేళా నిర్వహణ ఉద్దేశం, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రత్యేకతలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా వాటికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ,  ఎన్ఆర్డీఐ అడిషనల్ డైరెక్టర్ కటారియా తో కలిసి మాట్లాడుతూ.. సరస్ మేళా లో ప్రత్యేక ఆకర్షణగా వెల్కమ్ రోబో నిలవనున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు, వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరస్ మేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఈ మేళా మహిళా సంఘాలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయాలను పెంచుకోవడానికి, ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు తయారు చేసిన సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు,గృహోపకరణాలు, సంప్రదాయ పిండివంటలు, విభిన్న రకాల ఆహార పదార్థాలు మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, కళా నైపుణ్యాలను ప్రతిబింబించే ఉత్పత్తులు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయని వివరించారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రజలను చేరుకోవడానికి శక్తివంతమైన వేదికగా మారిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రీల్స్, వీడియోలు, బ్లాగులు, ఇతర డిజిటల్ కంటెంట్ రూపంలో సరస్ మేళా విశేషాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథలు, వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల ప్రత్యేకతలు, వాటి నాణ్యత, సంప్రదాయ కళానైపుణ్యాలను ప్రజలకు పరిచయం చేయాలని సూచించారు.

సోషల్ మీడియా ద్వారా కల్పించే విస్తృత ప్రచారంతో విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో మేళాను సందర్శించి, మహిళా సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా మహిళా సంఘాల ఆదాయం పెరగడంతో పాటు, వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, మహిళా సాధికారత బలోపేతం కావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

మేళా ప్రాంగణంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు, ప్రత్యేక ఉత్పత్తుల వివరాలను యువతకు చేరవేసేలా ప్రచారం నిర్వహించాలని ఇన్‌ఫ్లుయెన్సర్లను కోరారు. సరస్ మేళాను ప్రజలకు మరింత చేరువ చేయడంలో సోషల్ మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

స్వయం సహాయక సంఘాల మహిళల కృషికి తగిన గుర్తింపు లభించేలా, వారి ఉత్పత్తులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.

Related posts

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్లకు షాక్..నాన్ బెయిలబుల్ వారెంట్‌!

Satyam News

నిన్న లోకేష్.. నేడు బాలయ్య..  ప్రజాసేవలో మామా అల్లుళ్ల పోటీ

Satyam News

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News

కరాచీ లో అమెరికా కాన్సులేట్ పై దాడి: 20 మంది మృతి

Satyam News

రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు చర్యలు ప్రారంభం

Satyam News

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

Satyam News

Leave a Comment