ముఖ్యంశాలుహోమ్

ఏలూరుకు రిలయన్స్ రాక..రూ.2.73 లక్షల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్ట్!

#Reliance

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం బిగ్‌ టర్న్‌ తీసుకుంటోంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, రాయలసీమకే పరిమితమైన భారీ పెట్టుబడుల ప్రవాహం ఇప్పుడు గోదావరి డెల్టా వైపు మళ్లింది. ఏపీలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లతో అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. కేంద్ర గనుల శాఖ నిర్వహించిన ఈ-వేలంలో ఏలూరు జిల్లాలోని చింతలపూడి, రేచర్ల కోల్ బ్లాకులను రిలయన్స్ దక్కించుకోవడంతో ఈ మెగా ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది.

సాధారణంగా బొగ్గును గనుల నుంచి తవ్వి బయటకు తీస్తారు. కానీ అత్యాధునిక ‘UCG’ పద్ధతిలో బొగ్గును వెలికితీయకుండా, భూగర్భంలోనే మండించి గ్యాస్‌గా మారుస్తారు. ఇలా ఉత్పత్తి అయిన గ్యాస్‌ను విద్యుత్, ఎరువుల తయారీతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాలకు ముడిసరుకుగా ఉపయోగిస్తారు. దేశ ఇంధన భద్రతను పెంచే ఈ దేశీయ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు కోసం రిలయన్స్ రాబోయే 30 ఏళ్లలో దశలవారీగా ఈ భారీ పెట్టుబడులను వెచ్చించనుంది.

ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా 3 దశల్లో చేపట్టేందుకు సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. తొలి దశలో భాగంగా ఈ ఏడాదే ప్రాథమిక అన్వేషణ పనులను ప్రారంభించి, సాంకేతిక సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరీక్షిస్తారు. ఆ తర్వాత రెండవ దశలో పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా వాణిజ్యపరమైన అవకాశాలను, లాభదాయకతను విశ్లేషిస్తారు. ప్రాజెక్ట్ లాభదాయకత నిర్ధారణ అయ్యాక, మూడవ దశలో దీర్ఘకాలిక ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తారు.

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏలూరుతో పాటు పరిసర జిల్లాల సామాజిక, ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల నుంచి 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. లాజిస్టిక్స్, రవాణా, ఇతర సేవారంగాల ద్వారా మరో 20 వేల నుంచి 35 వేల మందికి పరోక్ష ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ లక్ష్య సాధనకు ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్‌గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను వేగవంతం చేస్తున్న తరుణంలో రిలయన్స్ రాక ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవడమే కాకుండా, రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ల డెస్టినేషన్‌గా మార్చేందుకు దిక్సూచిలా పనిచేస్తుందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Related posts

నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే హైడ్రా నిద్రపోతుందా?

Satyam News

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం

Satyam News

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News

వనపర్తిలో జిల్లా ఎస్పీ సునితకు స్వాగతం

Satyam News

గడ్చిరోలిలో మళ్లీ కనిపించిన మావోల కదలికలు

Satyam News

ఉత్తరాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక

Satyam News

Leave a Comment