ఉరి శిక్ష అమలు చేసే విధానాలను మార్చాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారంనాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే ప్రక్రియ ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం నొప్పితో కూడుకున్నదని, అందువల్ల దాన్ని రద్దు చేసి, నొప్పి తక్కువగా ఉండే మార్గాలను అమలు చేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) సుప్రీంకోర్టులో దాఖలు అయింది. మరణశిక్ష అమలుకు ఉరి బదులు ఇంట్రావీనస్ లెథల్ ఇంజెక్షన్, కాల్చి చంపడం, విద్యుత్ షాక్ లేదా గ్యాస్ ఛాంబర్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాలని పిటిషన్‌లో కోరారు.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 354(5), ప్రస్తుతం దాని స్థానంలో అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 393(5) మరణశిక్షను ఉరి ద్వారా అమలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ నిబంధనల రాజ్యాంగబద్ధతను పునఃపరిశీలించేందుకు కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఉరి విధానం మరణశిక్ష అమలులో ఖైదీకి అనవసరమైన నొప్పి, బాధ కలిగించే అవకాశం ఉందని ఆయన వాదించారు. మరణశిక్షను మరింత మానవీయంగా అమలు చేయడానికి లెథల్ ఇంజెక్షన్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను పరిగణించాలని కోరారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 49 రాష్ట్రాలు లెథల్ ఇంజెక్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
మరణశిక్ష విధించబడిన వ్యక్తికి గౌరవప్రదమైన పద్ధతిలో మరణించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ప్రస్తుత ఉరి విధానాన్ని చట్టం నుంచి తొలగించాలని సూచించిన లా కమిషన్ 187వ నివేదికను కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే, ఉరి విధానాన్ని తొలగించాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. 2018 ఏప్రిల్‌లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ‘మెడకు ఉరి వేసి మరణించే వరకు’ అమలు చేయడం సురక్షితమైనదని, త్వరగా ప్రాణాలను తీసే విధానమని కేంద్రం పేర్కొంది. లెథల్ ఇంజెక్షన్, కాల్పుల దళం, విద్యుదాఘాతం వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఏదైనా సక్రమంగా అమలు కాకపోతే మరింత క్రూరమైన, అమానవీయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం వాదించింది.
ఆధునిక విధానాలను అనుసరించిన ఉరి అమలు ఇతర పద్ధతులతో పోలిస్తే తక్కువగా విఫలమయ్యే అవకాశముందని, లెథల్ ఇంజెక్షన్ వంటి విధానాల్లో అమలు ప్రక్రియ విఫలమయ్యే సందర్భాలు ఉండవచ్చని కేంద్రం పేర్కొంది. మరణశిక్ష అమలులో ఎలాంటి అవమానం, క్రూరత్వం, అనాగరికత చోటుచేసుకోకుండా గౌరవం, మర్యాదతో ప్రక్రియను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది.
ఈ అంశంపై కేంద్రం కొనసాగిస్తున్నస్టాటస్ కో వైఖరిపై 2025 అక్టోబర్ 15న సుప్రీంకోర్టు ప్రశ్నలు కూడా లేవనెత్తింది. అయితే ప్రస్తుత విచారణలో ఉరి విధానాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించేందుకు లేదా ఈ అంశాన్ని పెద్ద ధర్మాసనానికి అప్పగించేందుకు తగిన కారణాలు లేవని తాజా తీర్పులో పేర్కొంది.
అయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలపై భవిష్యత్తులో చర్చకు తలుపులు పూర్తిగా మూసివేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణశిక్ష అమలు విధానాన్ని సమగ్రంగా సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, న్యాయశాస్త్రం, ఫోరెన్సిక్ మెడిసిన్, న్యూరోసైన్స్, క్రిమినాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని ధర్మాసనం సూచించింది. అనవసరమైన నొప్పిని తగ్గించడంతో పాటు మరణశిక్ష ఖైదీ గౌరవాన్ని కాపాడే రాజ్యాంగ లక్ష్యానికి ఏ ప్రత్యామ్నాయ విధానం మెరుగ్గా సరిపోతుందో అలాంటి నిపుణుల సంస్థ పరిశీలించవచ్చని పేర్కొంది.
