పిచ్చికి పరాకాష్ట ఇది. ఒక ప్రయివేటు స్కూల్ లో విద్యార్థినులు నిర్వహించిన ‘బురఖా డ్యాన్స్’ తీవ్రమైన మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టింది. వివరాలలోకి వెళితే….ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొంత మంది హిందూ బాలికలు బురఖాలు ధరించి బురఖా డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్సు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు విచారణ చేపట్టారు.
తీరా చూస్తే అసలు ఆ స్కూలును ప్రభుత్వ గుర్తింపు లేకుండానే నిర్వహిస్తున్నట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.
గోండా జిల్లా బభన్‌జోత్ ప్రాంతంలోని ఔసానీ బుజుర్గ్‌లో ఈ ప్రైవేట్ పాఠశాల ఉంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించినదిగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ పాఠశాలపై అధికారుల దృష్టి పడింది. అనంతరం జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
జిల్లా ప్రాథమిక విద్యాధికారి అమిత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) రియాజ్ అహ్మద్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణకు అవసరమైన గుర్తింపు లేకుండానే విద్యా సంస్థను కొనసాగిస్తున్నట్లు తనిఖీలో నిర్ధారణ అయింది. దీంతో అధికారులు పాఠశాలపై చర్యలు తీసుకున్నారు.
సుమారు వారం రోజుల క్రితమే పాఠశాల యాజమాన్యానికి విద్యాశాఖ అధికారులు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. అయితే ఆదేశాలను పట్టించుకోకుండా పాఠశాలను కొనసాగించినట్లు ఆయన చెప్పారు.
అనంతరం అధికారులు పాఠశాల మేనేజర్, ప్రిన్సిపాల్ కార్యాలయాలకు తాళాలు వేశారు. పాఠశాల ప్రధాన గేటును కూడా మూసివేసి, మొత్తం ప్రాంగణాన్ని సీజ్ చేశారు. తనిఖీ, సీజ్ ప్రక్రియకు సంబంధించిన నివేదికను జిల్లా ప్రాథమిక విద్యాధికారికి సమర్పించినట్లు రియాజ్ అహ్మద్ వెల్లడించారు.
విద్యార్థుల విద్యాభ్యాసానికి అంతరాయం కలగకుండా అధికారులు తదుపరి చర్యలు కూడా చేపట్టారు. గుర్తింపు లేని ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు లేదా ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా ప్రాథమిక విద్యాధికారి అమిత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాలపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరిగినప్పటికీ, అధికారుల తనిఖీలో పాఠశాల గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న అంశమే ప్రధానంగా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో పాఠశాల నిర్వహణపై విద్యాశాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా వారిని గుర్తింపు పొందిన సమీప పాఠశాలల్లో చేర్పించే ప్రక్రియ చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు.
