గుంటూరుహోమ్

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

#GodavariPushkarams

ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు.

పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని, స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు.

పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లు ఆర్ధిక శాఖ కేటాయింపులు జరిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. వీటిలో పట్టణాభివృద్ధి, ఆర్ అండ్ బీ, జల వనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయి. ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో 1,869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1,501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనుల పూర్తికి  అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్ర సాయం కూడా తీసుకోవాలని  అధికారులకు సీఎం సూచించారు.

2027 పుష్కరాలకు భారీగా భక్తులు

2015 మహా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేయగా. 2027లో 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నట్టు అధికారులు వివరించారు. రోజుకు సుమారు కోటి మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు.

వీటిలో ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 82 ఘాట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 40 ఘాట్లు, కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు, ఏలూరు జిల్లాలో 44 ఘాట్లు, కాకినాడ జిల్లాలో 88 ఘాట్లు, పోలవరం జిల్లాలో  11 ఘాట్లు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.

టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని… పిఠాపురంలో శక్తి పీఠం సహా పంచారామాల్లో 4 క్షేత్రాలు, ఇంకా ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

పుష్కరాలకు వచ్చే భక్తులు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోం స్టేలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు.  సమీక్షలో ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘రాజమహేంద్రవరంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలి.

దేశ విదేశాల్లో ప్రముఖులు అందరికీ గోదావరి పుష్కరాలకు ఆహ్వానం అందించాలి. రాష్ట్ర విశిష్టత తెలిసేలా, ప్రతిష్ట పెరిగేలా చేసేందుకు ఇదొక అవకాశంగా భావించాలి. కూచిపూడి ఈవెంట్ వంటివి భారీ తరహాలో నిర్వహించేలా దేవా దాయ-పర్యాటక శాఖలు ప్రణాళికలు రూపొందించాలి. పుష్కర ఘాట్లను కలిపే రహదారుల నిర్మాణం సహా, పుష్కరాలు జరిగే 6 జిల్లాలో ఏ రోడ్లపైనా గుంతలు కనిపించకూడదు.

పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా రహదారుల నిర్మాణం జరగాల్సి ఉంది. బ్రిడ్జిల సామర్ధ్యాన్ని పరిశీలించి, దానికి అనుగుణంగా మరమ్మతులు చేయాలి. గోదావరిలో చుక్క కూడా మురుగు నీరు కలవకుండా చూడాలి. అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. హేవ్‌లాక్ బ్రిడ్జి, సమీపంలో దీవుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.’ అని నిర్దేశించారు.

రద్దీ నిర్వహణకు ఏఐ వినియోగం

ఈసారి పుష్కరాల్లో భద్రత, రద్దీ నిర్వహణకు ఏఐ ఆధారిత క్రౌడ్‌ అనలిటిక్స్‌, సీసీటీవీ ఎంట్రీ-ఎగ్జిట్‌ మానిటరింగ్‌, డ్రోన్‌ సర్వైలెన్స్‌, క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు, డీసెంట్రలైజ్డ్‌ డిప్లాయ్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి సాంకేతికత వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

వైద్య సేవల పరంగానూ ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంబులెన్స్‌లు, ఫస్ట్ ఎయిడ్‌, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. 30 ఫీల్డ్ ఆస్పత్రులను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసి, వాటికి అనుబంధంగా ల్యాబ్‌లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

మోడల్‌ పుష్కర పంచాయతీగా ముని కూడలి

గోదావరి నదీ పరివాహక జిల్లాల్లోని 260 గ్రామ పంచాయతీలలో 50 గ్రామ పంచాయతీలను మోడల్‌ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయ తలపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముని కూడలిని పైలట్‌ మోడల్‌ పుష్కర పంచాయతీగా ఎంపిక చేశారు. కొవ్వూరు–పోలవరం మీదుగా పట్టిసీమ రోడ్డు, సీతానగరం నుంచి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజ్‌ వరకు BT రోడ్డు, అలాగే అవెన్యూ ప్లాంటేషన్‌, బ్యూటిఫికేషన్‌… సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజ్‌ నుంచి కొవ్వూరు వరకు రోడ్లు అభివృద్ధి చేయనున్నారు.

రాజమహేంద్రవరం–పోలవరం మధ్య జాతీయ రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాలు కాలుష్య రహితంగా చేసేందుకు 487 గ్రీన్‌ ఎనర్జీ బస్సులు వినియోగించనున్నారు. అలాగే 11 బస్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. నదిలో భక్తుల భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. 2,697 రెస్క్యూ బోట్లు సిద్ధం చేయడంతో పాటు, 8,955 శిక్షణ పొందిన ఈతగాళ్లను పుష్కరాల సమయంలో నియమించనున్నారు.

అఖండ గోదావరికి పుష్కర ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు, దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రపంచస్థాయి మౌలిక వసతులు, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, భద్రత, వసతి, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర ఏర్పాట్లను అద్భుతంగా చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉప నదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున ‘అఖండ గోదావరి’ పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, వై సత్యకుమార్ యాదవ్, గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

డీప్‌ఫేక్ కలకలం: మహిళ ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు!

Satyam News

ఆర్ టి ఐ దరఖాస్తులతో బ్లాక్ మెయిల్…?

Satyam News

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Satyam News

ఆ ఒక్క కారణంతో.. కూటమిలో తిరుగులేని ఐక్యత

Satyam News

మీ పట్ల ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉంది

Satyam News

Leave a Comment