జాతీయంహోమ్

బంగారపు ఉంగరాలు ఇచ్చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్

#TVKVijay

నిజంగానే తమిళనాడు సీఎం విజయ్ అందరికి బంగారపు ఉంగరాలు ఇచ్చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు బంగారపు ఉంగరం ఇస్తామని విజయ్ గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయం మేరకు అందించే ‘థైమామన్ గోల్డ్ రింగ్ స్కీమ్’ అమలుకు తమిళనాడు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

ఈ పథకం కింద సుమారు రూ.220 కోట్ల వ్యయంతో 1,28,499 బంగారు ఉంగరాల సరఫరాకు రెండు ప్రముఖ జువెలరీ సంస్థలకు వర్క్ ఆర్డర్లు జారీ చేసింది. తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (TNMSC) జోయలుక్కాస్, కళ్యాణ్ జువెల్లర్స్‌కు 70:30 నిష్పత్తిలో ఈ ఆర్డర్లను ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి జన్మదినమైన జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలకు ఈ పథకం వర్తించనుంది.

మొదటి దశలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల కాలానికి 1,28,499 ఉంగరాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఒక్కో ఉంగరం 22 క్యారెట్ల బంగారంతో సుమారు ఒక గ్రాము బరువుతో తయారు చేయనున్నారు. మొత్తం బంగారం బరువు సుమారు 128.5 కిలోలుగా ఉండనుంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక్క గ్రాము బంగారానికి ప్రభుత్వం సుమారు రూ.14,850 చెల్లించాల్సి ఉంటుందని అంచనా.

మొదటి విడతలో జోయలుక్కాస్‌కు 70 శాతం వాటా కింద 89,949 ఉంగరాలు, కళ్యాణ్ జువెల్లర్స్‌కు 30 శాతం వాటా కింద 38,550 ఉంగరాలు సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. బంగారం ధర మార్కెట్‌లో మారుతూ ఉండటంతో తుది వ్యయం కూడా మారే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, సరఫరా చేసే బంగారానికి అప్పటి మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం చెల్లించనుంది.

ఏడాది కాలానికి మొత్తం 4,41,667 బంగారు ఉంగరాల సరఫరా కోసం తమిళనాడు ప్రభుత్వం రూ.755.83 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఈ పథకం కోసం జూలై 14న TNMSC టెండర్ నిర్వహించగా 11 కంపెనీలు పాల్గొన్నాయి. టెండర్‌లో పాల్గొన్న సంస్థలు తమ ధరలను తమిళనాడు టెండర్స్ పోర్టల్ ద్వారా సమర్పించాయి.

జోయలుక్కాస్ బంగారం ఒక గ్రాము ధరకు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు, బీమా, రవాణా, బీఐఎస్ హాల్‌మార్కింగ్ తదితర అన్ని ఖర్చులను కలుపుకుని కేవలం రూ.0.01 సేవా రుసుముగా కోట్ చేసి అత్యల్ప ధరను నమోదు చేసింది. అనంతరం నిబంధనల ప్రకారం మిగిలిన 10 మంది బిడ్డర్లకు ఈ ధరను వెల్లడించగా, కళ్యాణ్ జువెల్లర్స్ కూడా అదే ధరను కోట్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే ఈ టెండర్ వ్యవహారం తమిళనాడు అసెంబ్లీలో రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు టెండర్ ప్రక్రియను ప్రశ్నించాయి. అదనపు ఛార్జీలకు విజయవంతమైన సంస్థ కేవలం ఒక పైసా కోట్ చేయడం అసాధారణమని విమర్శించాయి. ఇతర పోటీ సంస్థలు అదనపు ఛార్జీలుగా రూ.410.97 నుంచి రూ.15,000కు పైగా కోట్ చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

టెండర్‌పై వచ్చిన విమర్శలకు జోయలుక్కాస్ స్పందిస్తూ.. మొత్తం టెండర్ విలువ సుమారు రూ.755 కోట్లని, అందులో ప్రధాన భాగం బంగారం విలువేనని తెలిపింది. ప్రస్తుత బంగారం ధరకు అదనంగా కేవలం ఒక పైసా మాత్రమే సేవా రుసుముగా ప్రతీకాత్మకంగా కోట్ చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.

అదే సమయంలో ఈ పథకం కోసం TNMSC ద్వారా టెండర్ నిర్వహించడాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. TNMSC ప్రధానంగా మందులు, వైద్య పరికరాల కొనుగోలు, ఆరోగ్య భవనాల నిర్మాణం కోసం ఏర్పాటైన సంస్థ అని పేర్కొన్నాయి. దీనిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి అరుణ్‌రాజ్ స్పందిస్తూ, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఈ పథకం కీలకమని సమర్థించారు.

సెప్టెంబర్ 15న ద్రవిడ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై జయంతి సందర్భంగా ‘థైమామన్ గోల్డ్ రింగ్ స్కీమ్’ను అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలను ప్రోత్సహించడం, మాతృత్వాన్ని గౌరవించడం, ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.

Related posts

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam News

సమ్మిళిత అభివృద్ధిలో జనాభా లెక్కలు అవసరం

Satyam News

అలీ లారిజానీ అంతిమ యాత్రలో కోట్లాది మంది….

Satyam News

ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు: ఇక సీరియస్

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News

Leave a Comment