ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘మద్యం’ ఎప్పుడూ వేడి పుట్టించే అంశమే. కానీ గత వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన మద్యం రవాణా దోపిడీ తీరు మాత్రం సామాన్య ప్రజల ఊహకు కూడా అందని స్థాయికి చేరింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో ఈ ‘ఫ్యామిలీ ప్యాక్’ కుంభకోణానికి చట్టపరమైన బిగింపు మొదలైంది.
కొండాపూర్‌లోని నివాసంలో కారుమూరిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు, బషీర్ బాగ్ కార్యాలయానికి తరలించారు. వైకాపా హయాంలో ప్రభుత్వ ఖజానాకు ఏకంగా ₹195.33 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, కేవలం రవాణా కాంట్రాక్టుల ద్వారానే రూ.28 కోట్ల వరకు ముడుపుల రూపంలో చేతులు మారాయని ఈడీ ఆధారాలతో సహా తేల్చేసింది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ వంటి ముసుగు కంపెనీల ద్వారా సాగించిన ఈ దందా ఇప్పుడు చట్టం ముందు బోనులో నిలిచింది.
కారుమూరి కుటుంబ అరెస్టు కేవలం ఒక్క వ్యక్తికో లేక ఒక కుటుంబానికో పరిమితమైన వ్యవహారం కాదు. ఇది తాడేపల్లి ‘జె-బ్రాండ్’ సామ్రాజ్యంలో భాగస్వాములైన ప్రతీ ఒక్క కీలక నాయకుడికి నేరుగా వెళ్లి తగులుతున్న తీవ్ర హెచ్చరిక.
గత ఐదేళ్లపాటు “మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు” అనే ధీమాతో విర్రవీగిన నేతలకు ఇప్పుడు రాత్రిపూట నిద్ర కరువైంది. సిఐడీ, ఈడీ విచారణల్లో బయటపడుతున్న వివరాలు చూస్తుంటే, శోధనల వేడి ఒక్కొక్కరి ముంగిటకూ చేరుతోంది.
హవాలా మార్గాలు, షెల్ కంపెనీల్లోకి నిధుల మళ్లింపు, రియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ ఇప్పుడు దర్యాప్తు సంస్థల రికార్డుల్లో నిక్షిప్తమయ్యాయి. నిన్నటిదాకా ‘కిక్కు’ ఇచ్చిన సొమ్ము, నేడు ‘ఖైదీ’గా మార్చే సంకెళ్లుగా మారడంతో వైకాపా నేతల్లో తీవ్ర భయం వ్యక్తమవుతోంది.
మద్యం డిస్టిలరీల నుండి రవాణా కాంట్రాక్టుల వరకు, కేవలం కొంతమంది సిండికేట్ ప్రతినిధులు, ఐటీ సలహాదారులు (రాజ్ కేసిరెడ్డి వంటివారు), అధికారుల (వాసుదేవరెడ్డి) అండతో సాగించిన ఈ ఆర్థిక నేరం కార్పొరేట్ కంపెనీలకు కూడా షాక్ ఇస్తోంది.
ప్రజల రక్తాన్ని పిండి, ప్రభుత్వం పేరుతో జే బ్రాండ్ కల్తీ అమ్మకాలు సాగిస్తూ, దాని రవాణాలో కూడా వందల కోట్ల దందా నడిపిన ముఠాకు ఇప్పుడు అసలైన చట్టపరమైన న్యాయం ఎదురవుతోంది. “మద్యం తాగిన కిక్కు దిగిపోవడానికి కొన్ని గంటలు పడుతుందేమో… కానీ ప్రజాధనం దోచుకుంటే వచ్చే ‘ఈడీ కిక్కు’ జీవితాంతం దిగదు” అని కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌ల జైలు ప్రయాణం నిరూపిస్తోంది.
తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు సాగిన ఈ బహుళ కోట్ల మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎంతమంది ఉన్నా… వారందరికీ వరుసగా చంచల్‌గూడ, రాజమండ్రి జైలు తలుపులు తెరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కారుమూరి ఇంట్లో మొదట కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇవ్వాళ తండ్రి అరెస్ట్ అయ్యాడు. కోడలి పేరు కూడా ఉంది. కారుమూరి కుటుంబానికి జగన్ లిక్కర్ స్కాం అరెస్టుల ఫ్యామిలీ ప్యాక్ లెక్కన మారింది.
