జాతీయంహోమ్

హిజాబ్ పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదే…

#Hijab

హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడంపై ప్రయాగ్‌రాజ్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న ఒక మైనర్‌ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్‌తో పాటు హిజాబ్‌/స్కార్ఫ్‌ ధరించేందుకు అనుమతించాలని విద్యార్థిని కోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ జె.జె. మునీర్‌, జస్టిస్‌ ఇంద్రజిత్‌ శుక్లాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ తీర్పు వెలువరించింది.

అదే పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని 11వ తరగతిలో ప్రవేశం కోరింది. తాను 6వ తరగతి నుంచి స్కూల్‌ యూనిఫామ్‌పై స్కార్ఫ్‌ ధరిస్తున్నానని, ఇప్పటివరకు పాఠశాల యాజమాన్యం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆమె పేర్కొంది. ఇందుకు ఆధారంగా 8, 9, 10వ తరగతులకు సంబంధించిన ఐడీ కార్డులు, గ్రూప్‌ ఫొటోలను కోర్టుకు సమర్పించింది. అయితే 11వ తరగతిలో ప్రవేశ సమయంలో స్కార్ఫ్‌ ధరించడం డ్రెస్‌కోడ్‌కు విరుద్ధమని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసి, ఆ కారణంతో అడ్మిషన్‌ నిరాకరించింది.

దీనిపై విద్యార్థిని జిల్లా కలెక్టర్‌కు రెండు ఫిర్యాదు లేఖలు సమర్పించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (DIOS) నివేదిక కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అసిస్టెంట్‌ DIOS‌ విచారణ చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ఇది సహవిద్యా పాఠశాల అని, అన్ని మతాలకు చెందిన విద్యార్థులు ఒకే యూనిఫామ్‌ నిబంధనలను పాటిస్తున్నారని తెలిపారు. ఒక విద్యార్థికి ప్రత్యేక మినహాయింపు ఇస్తే పాఠశాల క్రమశిక్షణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని వాదించారు.

హిజాబ్ మతపరమైనది… దాన్ని అడ్డుకునే హక్కు మీకు లేదు…

స్కార్ఫ్‌ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(a) కల్పించిన భావప్రకటన స్వేచ్ఛలో భాగమని, అది వ్యక్తిగత గౌరవం, శారీరక స్వేచ్ఛతో ముడిపడి ఉందని విద్యార్థిని తరఫు న్యాయవాది వాదించారు. అలాగే స్కార్ఫ్‌ ధరించడం మతపరమైన ఆచారంలో భాగమని, దానిని నిరోధించడం ఆర్టికల్‌ 14, 19(1)(a) కింద ఉన్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ఇది ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలని, ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉండదని రాష్ట్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ తరఫు న్యాయవాదులు  తెలిపారు. విద్యార్థుల మధ్య ఏకరూపత, క్రమశిక్షణ, సంస్థాగత గుర్తింపును కొనసాగించేందుకు యూనిఫామ్‌ నిర్ణయించడం పాఠశాల యాజమాన్య విధానపరమైన అంశమని పేర్కొన్నారు. ఇందులో మత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగడం లేదని వాదించారు.

యూనిఫామ్‌ నిబంధన ఏకరీతిగా, సదుద్దేశంతో, వివక్ష లేకుండా, పాఠశాల క్రమశిక్షణ, సంస్థాగత గుర్తింపును పరిరక్షించే ఉద్దేశంతో రూపొందించినదైతే దానిని నిర్ణయించే అధికారం ప్రధానంగా పాఠశాలకే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

కింది తరగతుల్లో విద్యార్థిని స్కార్ఫ్‌ ధరించినప్పటికీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం వల్ల భవిష్యత్తులో కూడా అదే విధంగా ధరించే శాశ్వత లేదా అమలు చేయదగిన హక్కు ఆమెకు ఏర్పడదని కోర్టు పేర్కొంది. గతంలో అభ్యంతరం వ్యక్తం చేయకపోవడానికి నిర్లక్ష్యం, నిబంధనల అమలులో సడలింపు, సంకల్పం లేకపోవడం లేదా మర్యాద వంటి కారణాలు ఉండవచ్చని తెలిపింది. పాఠశాల తర్వాత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ‘ఎస్టాపెల్‌ సూత్రం’ వర్తించదని పేర్కొంది.

యూనిఫామ్‌ విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వం, పాఠశాల గుర్తింపును పెంపొందించడంతో పాటు అన్ని మతాల విద్యార్థులకు సమానంగా వర్తించడం ద్వారా లౌకిక వాతావరణాన్ని కొనసాగించేందుకు దోహదపడుతుందని హైకోర్టు అభిప్రాయపడింది.

స్కార్ఫ్‌ ధరించడం తన మతంలో ‘అత్యవసరమైన మతపరమైన ఆచారం’ అని నిరూపించేందుకు విద్యార్థిని ఎలాంటి మతగ్రంథాలు లేదా ఇతర ఆధారాలను సమర్పించలేదని కోర్టు గుర్తించింది. స్కూల్‌ గ్రూప్‌ ఫొటోల్లో అదే మతానికి చెందిన ఇతర విద్యార్థులు స్కార్ఫ్‌ ధరించకుండా ఉన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.

విద్యార్థిని మత విశ్వాస స్వేచ్ఛను పాఠశాల అడ్డుకోవడం లేదని, కేవలం సంస్థాగత క్రమశిక్షణలో భాగమైన యూనిఫామ్‌ను పాటించాలని కోరుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి తన ఇష్టానుసారం యూనిఫామ్‌లో మార్పులు చేసుకునేందుకు అనుమతిస్తే, ‘యూనిఫామ్‌’ అనే భావనకే అర్థం ఉండదని వ్యాఖ్యానించింది.

అంతేకాక, యూనిఫామ్‌లో మార్పులు కోరేవారు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలే తప్ప, యూనిఫామ్‌ను మార్చాలని పట్టుబట్టకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Related posts

కలలకు సహకరించిన కుంచె

Satyam News

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

నిమ్స్‌లో వెయ్యి మంది పేషెంట్లకు రొబోటిక్ సర్జరీలు

Satyam News

ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

Satyam News

మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?

Satyam News

అనంతపురం యాపిల్స్‌.. . షిమ్లాకి పోటీగా సీమ రేగిపండ్లు

Satyam News

Leave a Comment