25.4 C
Hyderabad
September 14, 2026
జాతీయంహోమ్

ఆసుపత్రిలో అగ్గి: ముగ్గురు నవజాత శిశువల మృతి

#Hospital

పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మరణించిన దురదృష్టకర సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి నగరంలోని ప్రభుత్వ జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ఆసుపత్రిలోని నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు పసికందులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 36 మంది శిశువులను ఆసుపత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి, అమరావతి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే తెలిపారు.

జిల్లా మహిళా ఆసుపత్రిలోని NICUలో అకాల ప్రసవం ద్వారా జన్మించిన, తక్కువ బరువుతో ఉన్న, తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శిశువులను ఉంచారు. ఈ విభాగంలో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి. ఇన్‌బోర్న్ శిశువులకు ఒక విభాగం, ఇతర ఆసుపత్రుల నుంచి తీసుకొచ్చిన ఔట్‌బోర్న్ శిశువులకు మరో విభాగం, డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్న శిశువుల కోసం స్టెప్‌డౌన్ కేర్ విభాగం ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో కలిపి 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు.

సోమవారం తెల్లవారుజామున సుమారు 3.15 గంటల సమయంలో ఔట్‌బోర్న్ శిశువుల విభాగంలో ఉన్న వెంటిలేటర్‌లో మంటలు చెలరేగినట్లు అమరావతి పోలీస్ కమిషనర్ రాకేశ్ ఓలా తెలిపారు. అయితే ఘటన సమయం సుమారు 4 గంటల సమయంలో జరిగినట్లు మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే పేర్కొన్నారు. వెంటిలేటర్‌లో మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఇతర శిశువులను సురక్షితంగా బయటకు తరలించారు.

వెంటిలేటర్ ఉన్న ఔట్‌బోర్న్ విభాగంలో మొత్తం తొమ్మిది మంది శిశువులు ఉండగా, వారిలో ముగ్గురు మంటల కారణంగా మృతి చెందారు. మిగిలిన ఆరుగురు శిశువులను సురక్షితంగా రక్షించారు. మరో ఆరుగురు శిశువులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది శిశువులను డివిజనల్ రిఫరల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురు చిన్నారులకు చికిత్స కొనసాగుతుండగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్రజా పనుల శాఖ (PWD) విద్యుత్ విభాగం అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటిలేటర్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలను వారు పరిశీలిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక కారణాలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం విచారణ పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటనపై మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన, చికిత్స పొందుతున్న శిశువులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి కారణాలను వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనతో శిశువుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆసుపత్రి యాజమాన్యం, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, చికిత్స పొందుతున్న శిశువుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Related posts

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

Satyam News

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోఉంటే అన్నీ మంచి ఫలితాలే

Satyam News

60శాతం ఉచిత సీట్లకు విమానయాన సంస్థలు వ్యతిరేకం

Satyam News

కొడాలి నానిపై ఫిర్యాదు: ఈ సారి అరెస్టు తప్పదా!

Satyam News

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News

అక్రమ స్కానింగ్ సెంటర్ల పై పూర్తి స్థాయి నిఘా

Satyam News

Leave a Comment