ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ ఎఫ్) ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు.
బుధవారం బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 112 మంది అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన రూ. 71,92,793 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.
బాపట్ల మండలంలో 39 మందికి రూ. 21,16,007లు, బాపట్ల పట్టణంలో 22 మందికి రూ. 12,53,240 లు, పిట్టలవానిపాలెం మండలం లో 24 మందికి రూ. 20,49,234 లు కర్లపాలెం మండలం 27 మందికి రూ. 17,74,312 లు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిధులు మంజూరు చేయడం జరుగుతోంది.
బాపట్ల నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదన్నదే మా సంకల్పం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తాం అని అన్నారు. ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల కష్టాలను ఆలకించి, తక్షణమే స్పందిస్తున్నారని, అందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే నిదర్శనమని పేర్కొన్నారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానూ, ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
