26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ఒకే ఆట… 665 ఏళ్లుగా…. మరో సారి…

#Turkey

ఒకే ఆట ఆ దేశంలో 665 ఏళ్లుగా ఆడుతున్నారు. ఆ దేశం ఏమిటంటే టర్కీ. వారు ఆడే ఆట మన దేశంలో ఆడే మల్లయుద్ధం లాంటిది. వంటికి ఆలివ్ ఆయిల్ రాసుకుని మరీ చేసే కుస్తీ పోటీ అన్నమాట. టర్కీలో శతాబ్దాల చరిత్ర కలిగిన కిర్క్‌పినార్ ఆయిల్ రెజ్లింగ్ ఉత్సవం మరోసారి వైభవంగా జరిగింది. ఎడిర్నే నగరంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ సంప్రదాయ క్రీడా మహోత్సవం ప్రపంచంలోనే నిరంతరంగా కొనసాగుతున్న అత్యంత పురాతన క్రీడా ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 665 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పోటీలకు ఈసారి దేశవ్యాప్తంగా 840 మంది పహిల్వాన్లు బరిలోకి దిగారు.

ఈ క్రీడలో పోటీదారులు తమ శరీరానికి ఆలివ్ నూనె రాసుకుని, ప్రత్యేక తోలు దుస్తులు ధరించి బురద మైదానంలో తలపడతారు. ప్రతి పోటీ ప్రారంభానికి ముందు పహిల్వాన్లు మైదానంలోని నేలను ముద్దాడి గౌరవం తెలుపుతారు. తాము ఈ నేల నుంచే పుట్టామని, చివరకు ఈ నేలకే చేరతామనే భావనకు ఇది ప్రతీకగా భావిస్తారు.

కిర్క్‌పినార్ ఉత్సవం ఆరంభంపై ఒక చారిత్రక గాథ కూడా ప్రచారంలో ఉంది. 1361లో ఒట్టోమన్ యువరాజు సులేమాన్ పాషా సైన్యంలోని నలభై మంది సైనికులు ప్రయాణంలో విశ్రాంతి సమయంలో కుస్తీ పోటీలు నిర్వహించగా, ఇద్దరు సోదరులు రోజుల తరబడి పోరాడి అలసటతో మరణించారని చెబుతారు. వారిని సమాధి చేసిన ప్రదేశంలో అనంతరం నీటి ఊటలు వెలువడటంతో ఆ ప్రాంతానికి “కిర్క్‌పినార్” అంటే “నలభై ఊటలు” అనే పేరు వచ్చిందని స్థానికులు విశ్వసిస్తారు.

ప్రపంచ రికార్డుల సంస్థ గిన్నిస్ ఈ ఉత్సవాన్ని అత్యంత పురాతనంగా నిరంతరంగా కొనసాగుతున్న పండుగల్లో ఒకటిగా గుర్తించగా, ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ యునెస్కో దీనిని సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఎడిర్నే మేయర్ ఫిలిజ్ గెంజాన్ అకిన్ మాట్లాడుతూ ఈ వారసత్వం కేవలం టర్కీకే కాకుండా ప్రపంచానికే గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ ఏడాది జరిగిన పోటీల్లో 26 ఏళ్ల ఎర్కాన్ తాష్ విజేతగా నిలిచి 16 లక్షల 55 వేల టర్కీ లీరాల నగదు బహుమతిని అందుకున్నాడు. అంతేకాకుండా సంప్రదాయం ప్రకారం “ఆగా”గా పిలిచే ప్రధాన పోషకుడి నుంచి ప్రత్యేక బహుమతులు కూడా అందుకున్నాడు.

కిర్క్‌పినార్ ఉత్సవంలో మరో విశేషం “ఆగా” వ్యవస్థ. ప్రతి ఏడాది వేలం ద్వారా అత్యధిక మొత్తం ప్రకటించిన ధనవంతుడికి ఈ గౌరవం లభిస్తుంది. ఈసారి టర్కీ వ్యాపారవేత్త ఉఫుక్ ఒజున్లు వచ్చే ఏడాది జరిగే 666వ కిర్క్‌పినార్ ఉత్సవానికి ఆగా హక్కులను పొందేందుకు 4 కోట్ల 66 లక్షల 66 వేల 666 టర్కీ లీరాలు ప్రకటించారు. వరుసగా మూడో ఏడాది ఈ గౌరవాన్ని దక్కించుకోవడంతో ఆయనకు శాశ్వత స్వర్ణ ఆగా బెల్ట్ ప్రదానం చేశారు.

టర్కీ ప్రభుత్వం ఈ సంప్రదాయ క్రీడను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పలువురు పహిల్వాన్లను ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల్లో నియమించి వారికి వేతనాలు చెల్లిస్తూ శిక్షణ, పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తోంది. తద్వారా ఈ సంప్రదాయం తరతరాలకు కొనసాగాలనే లక్ష్యంతో ప్రభుత్వం మద్దతు అందిస్తోంది.

టర్కీలో కిర్క్‌పినార్ కేవలం క్రీడగా కాకుండా సంస్కృతి, సంప్రదాయం, గౌరవం, సామాజిక గుర్తింపుకు ప్రతీకగా కొనసాగుతోంది. శతాబ్దాల చరిత్రను సజీవంగా నిలబెట్టిన ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ క్రీడలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Related posts

ప్రభుత్వ బడుల్లో విద్య మరింత బలోపేతం

Satyam News

IVF యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేరెళ్ల తేజ సాయి వెంకట్

Satyam News

క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు

Satyam News

ఏలూరుకు రిలయన్స్ రాక..రూ.2.73 లక్షల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్ట్!

Satyam News

రైతు బాధలు వింటే కడుపు తరుక్కపోతోంది

Satyam News

మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగాయి?

Satyam News

Leave a Comment