వైసీపీ తనపై చేస్తున్న సోషల్‌మీడియా ప్రచారానికి చెక్ పెడుతూ వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన బహిరంగ లేఖ రాశారు. తనను నమ్మకద్రోహి అంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.తాను ఎన్నడూ జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదని, నిజానికి జగన్ వెంట ఉండి ప్రతి ఛార్జ్‌షీట్‌లో A-2గా చేరి 15 నెలల పాటు జైలు జీవితం గడిపానని గుర్తుచేశారు. 2024 తర్వాత కూడా తనకు సంబంధం లేని లిక్కర్, కాకినాడ సీపోర్టు కేసుల్లో ఇరికించారని, అసలైన కోటరీ నాయకుడు సజ్జల మాత్రం ఎలాంటి కేసుల లేకుండా సేఫ్‌గా ఉన్నారని ఆరోపించారు.
ఈ లేఖలో సాయిరెడ్డి చేసిన అతిపెద్ద సంచలన ఆరోపణ..సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేసిన భౌతిక దాడి ఉదంతం! 2022లో మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లీనరీలో సజ్జల నేరుగా తనపై భౌతికంగా దాడి చేశారని, ఈ విషయాన్ని అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా చూసి కూడా కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఆయన చేతిలో బందీ అయిపోవడం వల్లే తనపై వరుసగా కుట్రలు జరిగాయని, 2022 ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో సాయి అన్నకు వయసైపోయింది..ముసలోడయ్యాడని వ్యాఖ్యానించి, తనను పార్టీ పదవుల నుంచి, ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించారని తెలిపాడు.
పరిపాలనా పరంగా సజ్జలను సకల శాఖ మంత్రిగా, రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన సాయిరెడ్డి..జగన్ చుట్టూ ఆయన పెద్ద గోడను నిర్మించారని విమర్శించారు. చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దక్కకుండా చేశారని తెలిపారు. పెద్దారెడ్డి, బొత్స, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి సీనియర్లందరినీ కాదని, సజ్జలను రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించి..ఆయనకు తామంతా రిపోర్ట్ చేయాలని ఆదేశించడం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు.
ప్రస్తుతం వైసీపీలో జగన్ నంబర్-2గా మారిపోగా, సజ్జల నంబర్-1 స్థానంలో ఉన్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. దాదాపు వైసీపీలో ఇలా 74 రకాల అవమానాలు జరిగాయని, కొత్త నంబర్-1 ముందు తలవంచి సాష్టాంగ నమస్కారాలు చేయలేకనే 4 సంవత్సరాల రాజ్యసభ పదవీ కాలాన్ని, పార్టీని వదులుకుని రాజీనామా చేశానని విజయసాయి స్పష్టం చేశారు. జగన్‌ను నిరంతరం మోసం చేస్తూ కోవర్ట్ రాజకీయం చేయడం తనకు చేతకాదని, అందుకే కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నానని లేఖ ముగించారు.
