ఎలక్టోరల్ రోల్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) లో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రచార దినాల్లో సంబంధిత బూత్ లెవల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన సమయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఫారం–6 ద్వారా కొత్తగా తమ పేరును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలోని ఏదైనా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం లేదా అనర్హులైన ఓటరు పేరును తొలగించేందుకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటరు వివరాల్లో తప్పులను సరిచేయడం, నివాసం మారిన సందర్భంలో చిరునామా, తదితర వివరాలను మార్చడం, ఓటరు గుర్తింపు కార్డుకు సంబంధించిన అనుమతించబడిన సవరణల కోసం ఫారం–8 ను సమర్పించవచ్చని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామిలిసు జాబితాలో ఏ, బి, సి కేటగిరీలో ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన ఏవేని ధ్రువపత్రాలను సమర్పించాన్నారు. ఏ కేటగిరీలో 01.07.1987కు ముందు జన్మించిన ఓటర్లు ఉంటారని, ఎన్నికల సంఘం నిర్దేశించిన ధృవపత్రాల్లో తమకు సంబంధించిన ఏదైనా ఒక పత్రం సమర్పించాలన్నారు. బీ కేటగిరీలో 01.07.1987 నుంచి 02.12.2004 వరకు జన్మించిన ఓటర్లు ఉంటారని, వీరు తమతోపాటు వారి తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఒక ధ్రువపత్రం అంటే మొత్తం రెండు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. సి కేటగిరీలో 02.12.2004 తర్వాత జన్మించిన ఓటర్లు వస్తారని, వీరు తమకు సంబంధించిన ఒక పత్రం తో పాటు తల్లి, తండ్రి ఇద్దరికీ సంబంధించిన పత్రాలు కలిపి మొత్తం మూడు డాక్యుమెంట్స్ సమర్పించాలనీ పేర్కొన్నారు.
సమర్పించవలసిన పత్రాల జాబితా:
- కేంద్ర ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వం / ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డు / పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు.
- 01.07.1987కు ముందు ప్రభుత్వం / స్థానిక సంస్థలు / బ్యాంకులు / పోస్టాఫీసులు / భారతీయ జీవిత బీమా సంస్థ / ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా భారతదేశంలో జారీ చేసిన గుర్తింపు కార్డు / ధృవీకరణ పత్రం / సంబంధిత పత్రం.
- సమర్థ అధికారిచే జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం.
- పాస్‌పోర్ట్.
- గుర్తింపు పొందిన బోర్డులు / విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రిక్యులేషన్ విద్యార్హత ధృవీకరణ పత్రం.
- సంబంధిత రాష్ట్ర సమర్థ అధికారిచే జారీ చేయబడిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం.
- అటవీ హక్కుల ధృవీకరణ పత్రం.
- సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రాలు.
- జాతీయ పౌర పట్టిక ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడ.
- రాష్ట్ర / స్థానిక అధికారులచే తయారు చేయబడిన కుటుంబ రిజిస్టర్.
- ప్రభుత్వం జారీ చేసిన భూమి / ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం.
ఈ విధంగా మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలో ఉన్న ఓటర్లు సమర్పించిన పత్రాలను పరిశీలించి, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తదుపరి ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లు సమర్పించే ప్రతి దరఖాస్తుకు సరైన రసీదు ఇవ్వాలని, స్వీకరించిన దరఖాస్తులు, పత్రాలను నిర్ణీత పోర్టల్/అప్లికేషన్‌లో వెంటనే నమోదు చేసి సంబంధిత ఏఈఆర్‌ఓకు తదుపరి పరిశీలన, పరిష్కారం కోసం పంపించాలని సూచించారు. ప్రత్యేక ప్రచార దినాలపై గ్రామాలు, వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత ఏఈఆర్‌ఓలు తమ పరిధిలోని ప్రతి బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్‌లకు సూచనలు తెలియజేయడంతో పాటు, ప్రత్యేక ప్రచార దినాల్లో పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి ప్రత్యేక ప్రచార దినం ముగిసిన వెంటనే ఫారం–6, ఫారం–7, ఫారం–8 ద్వారా స్వీకరించిన దరఖాస్తుల సంఖ్య, ఎస్‌ఐఆర్‌కు సంబంధించి సేకరించిన పత్రాల వివరాలు, బీఎల్‌ఓల హాజరు, దరఖాస్తుల నమోదు, తదితర అంశాలతో కూడిన రోజువారీ సమగ్ర నివేదికను సమర్పించాలని ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. ప్రత్యేక ప్రచార దినాల్లో విధులకు గైర్హాజరు కావడం, నిర్లక్ష్యం వహించడం లేదా విధులను సక్రమంగా నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి, సంబంధిత సిబ్బందిపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
