30.9 C
Hyderabad
September 10, 2026
జాతీయంహోమ్

ధనవంతుడైన మామ హత్యకు కోడలు కుట్ర?

#KanpurMurder

బాగా ధనవంతుడైన మామను హత్య చేసేందుకు సొంత కోడలే కుట్రపన్నింది. ఈ విషయం దర్యాప్తులో వెల్లడి కావడంతో దర్యాప్తు అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. కాన్పూర్‌లో ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా హత్య కేసులో ఈ కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇందిరానగర్ ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో గొంతు కోయడం ద్వారా హత్యకు గురైన మినోచా కేసులో ఆయన కోడలు శాలూను పోలీసులు అరెస్టు చేశారు.

కుటుంబంలో నెలకొన్న విభేదాలు, కోడలిపై నిఘా పెట్టడం, ఆర్థిక వ్యవహారాలపై ఆంక్షలు విధించడం వంటి అంశాలు హత్యకు దారితీసిన కుట్రలో పాత్ర పోషించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిందితులపై ఉన్న ఆరోపణలు ఇంకా న్యాయస్థానంలో రుజువు కావాల్సి ఉంది.

ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వని మామ

ముందుగా ఈ హత్యకు కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. అయితే ఇంటి పరిసరాల్లోని నిఘా కెమెరాల దృశ్యాలు, ఫోన్ కాల్ వివరాలు, తొలగించిన సందేశాలు, మినోచా మాజీ ఉద్యోగి ప్రమేయంపై వెలుగులోకి వచ్చిన అంశాలతో దర్యాప్తు క్రమంగా కుటుంబానికి సన్నిహితులైన వ్యక్తుల వైపు మళ్లింది.

తన కుమారుడు, కోడలు ఏపని చేస్తున్నారనే నిఘా వేసి వారి ఖర్చులపై కూడా మినోచా నియంత్రణ విధించాడు. దాంతో కోడలు మామగారిని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది.

మినోచా కుమారుడు సుబ్రత్, కోడలు శాలు, వారి ఆరేళ్ల కుమారుడు శనివారం రాత్రి 9.36 గంటల సమయంలో పార్టీకి వెళ్లారు. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్ వైపు వచ్చినట్లు నిఘా కెమెరాల్లో నమోదైంది. వారు ఇంట్లోకి ప్రవేశించి, మినోచా తిరిగి వచ్చే వరకు లోపలే దాక్కొని ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీసీ టీవీతో బయటపడ్డ నేరం

వ్యాపారవేత్త మినోచా రాత్రి 10.58 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అనుమానితులు సుమారు గంటా పావు నుంచి ఫ్లాట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మినోచా నిద్రిస్తున్న సమయంలో దిండుతో ఊపిరాడకుండా చేసి, సహజ మరణంగా చిత్రీకరించాలనేది మొదటి ప్రణాళికగా ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆయన పిల్లల గది వైపు వెళ్లే సమయంలో నిందితులను ఎదుర్కోవడంతో పరిస్థితి మారిందని, అనంతరం కత్తులతో దాడి చేసి గొంతు, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.

సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా మినోచా ఇంటిలో సుమారు 12 నుంచి 13 సంవత్సరాల పాటు పనిచేసిన మాజీ ఉద్యోగి విశాల్ గౌతమ్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులతో అతడికి ఉన్న పరిచయం, ఇంటి నిర్మాణం, గదుల అమరికపై అతడికి ఉన్న అవగాహనను పోలీసులు పరిశీలిస్తున్నారు. విశాల్ తన సహచరుడు రాజ్ కిషోర్‌తో కలిసి నకిలీ తాళంచెవితో ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు నిఘా కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నకిలీ తాళంచెవి వినియోగం ముందస్తు ప్రణాళికకు సంబంధించినదై ఉండవచ్చన్న అనుమానాన్ని మరింత బలపరిచింది.

విశాల్, రాజ్ కిషోర్‌లను విచారించిన సమయంలో కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ ప్రాంత డీసీపీ ఖాసిం అబిదీ తెలిపిన వివరాల ప్రకారం.. మినోచాను హత్య చేసేందుకు శాలు తమకు డబ్బు ఇస్తానని చెప్పి హత్యకు ఏర్పాట్లు చేసిందని ఇద్దరు నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో శాలూను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

శాలు, విశాల్ మధ్య పెద్ద ఎత్తున ఫోన్, వాట్సాప్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మే 1 నుంచి హత్య జరిగిన రోజు వరకు వారిద్దరి మధ్య సుమారు 309 సార్లు ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. హత్యకు సంబంధించిన ప్రణాళిక ఎప్పుడు మొదలైంది, దాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు అనే అంశాలను ఈ సంభాషణల ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు.

హత్యకు వాట్సయాప్ ద్వారా కుట్ర

శాలు, విశాల్ మధ్య జరిగిన 49 సందేశాలు తొలగించబడినట్లు దర్యాప్తులో బయటపడింది. సాంకేతిక విశ్లేషణ ద్వారా ఆ సందేశాలను తిరిగి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటిలో హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మినోచా హత్యకు రూ.6 లక్షల ఒప్పందం కుదిరిందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో మాజీ ఉద్యోగి విశాల్, మినోచా కోడలు శాలు ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం రూ.2 లక్షలు, మరో 15 రోజుల తర్వాత మిగిలిన రూ.4 లక్షలు చెల్లించేలా ఒప్పందం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంట్లో నుంచి నగదు, విలువైన వస్తువులు కనిపించకుండా పోకపోవడం కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. దీంతో సాధారణ దోపిడీ కోణం కంటే కుటుంబ విభేదాలు, వ్యక్తిగత కక్షలు, ఆర్థిక కారణాలే హత్యకు కారణమై ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై ఉన్న ఆరోపణలు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో భాగంగానే ఉన్నాయని, అవి న్యాయస్థానంలో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related posts

మరో పెద్ద తప్పు చేస్తున్న కేసీఆర్

Satyam News

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News

శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభం

Satyam News

పబ్లిక్ లోకి వచ్చిన స్మృతి మందానా

Satyam News

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు

Satyam News

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

Leave a Comment