హైదరాబాద్హోమ్

తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా

#SingareniCoal

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు అవసరాలు అధికమవుతున్న వేళ సింగరేణి సంస్థ  స్వరాష్ట్రమైన తెలంగాణకు అండగా నిలుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు విద్యుత్ సంస్థలు సింగరేణి వైపు చూస్తూ.. ‘మాకూ బొగ్గు సరఫరా చేయండి’ అంటూ కోరుతున్నాయి. సింగరేణి బొగ్గుకు ఇంతటి డిమాండ్ ఉన్నప్పటికీ సంస్థ మాత్రం తెలంగాణ విద్యుత్ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తోంది.

రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు భరోసా కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకు సింగరేణి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తోంది. కీలక సమయాల్లో విద్యుత్ రంగానికి అండగా నిలుస్తూ రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా మారుతోంది.

ఇతర రాష్ట్రాలకు బొగ్గు విక్రయం ద్వారా వాణిజ్య అవకాశాలు ఉన్నప్పటికీ.. ‘సంస్థ‌ వాణిజ్య ప్ర‌యోజ‌నాల‌ కన్నా స్వరాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యం’ అన్న విధానంతో ఉత్పత్తి చేసిన బొగ్గులో తెలంగాణ అవసరాలకే సింహభాగం కేటాయిస్తూ తద్వారా రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న తీరుపై ప్రత్యేక కథనం.

ప్రతీ పది టన్నుల్లో తొమ్మిది టన్నులు తెలంగాణకే!

సింగరేణి సంస్థ తాను ఉత్పత్తి చేసిన బొగ్గును దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలు విద్యుత్ సంస్థలకు కొన్ని దశాబ్దాలుగా బొగ్గు రవాణా చేస్తూ ఆయా రాష్ట్రాల ఇంధన అవసరాలను తీరుస్తోంది.

అయితే దేశంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ విద్యుత్ అవసరాలకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యుత్ రంగానికి సరఫరా చేస్తున్న ప్రతీ పది టన్నుల బొగ్గులో దాదాపు తొమ్మిది టన్నులు తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకే చేరుతుండటం విశేషం.

గ‌త నెల‌లో (ఆగ‌స్టులో) సింగ‌రేణి 40,51,312 ట‌న్నుల బొగ్గును దేశంలోని విద్యుత్ సంస్థ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌గా.. అందులో 36,25,937 ట‌న్నుల బొగ్గును తెలంగాణ‌లో ఉన్న విద్యుత్ సంస్థ‌ల‌కు ర‌వాణా చేయ‌డం జ‌రిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న‌ జెన్ కోల‌కు దాదాపు 90 శాతం స‌ర‌ఫ‌రా జ‌రిగింది. స‌గ‌టున ఒక రోజుకు 1,30,687 ట‌న్నుల బొగ్గును థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా..  తెలంగాణ థ‌ర్మ‌ల్ కేంద్రాల‌కు స‌గ‌టున రోజుకు 1,16,966 ట‌న్నుల బొగ్గును అందిస్తూ రాష్ట్ర ఇంధ‌న అవ‌స‌రాలు తీరుస్తోంది.

అత్య‌ధికంగా టీజీ జెన్ కోకు 50 శాతం బొగ్గు…

గత నెలలో కొత్తగూడెం థ‌ర్మ‌ల్‌ విద్యుత్ కేంద్రానికి  6,99,661  ట‌న్నుల బొగ్గును 179 రేకుల ద్వారా స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. సగటున రోజుకు  22,570 టన్నుల చొప్పున సగటున రోజుకు ఆరు రేకుల ద్వారా రవాణా జరిగింది.

యాదాద్రి థ‌ర్మ‌ల్  విద్యుత్ కేంద్రానికి  7,99,017 ట‌న్నుల‌ బొగ్గును 203 రేకుల ద్వారా సరఫరా చేయ‌డం జ‌రిగింది. ఈ లెక్క‌న‌ సగటున రోజుకు 25,775 టన్నుల బొగ్గు సగటున రోజున 7 రేకుల ద్వారా రవాణా  అయింది.

భూపాలపల్లి లోని కాకతీయ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌ ప్లాంట్ కు 1,02,959 టన్నుల బొగ్గును రవాణా చేసింది. కాగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కు 4,14,719 టన్నుల బొగ్గును సగటున రోజుకు 13,378 ట‌న్నుల చొప్పున బొగ్గును రవాణా చేయడం జరిగింది.

మొత్తం మీద చూస్తే తెలంగాణ జెన్కోకు గ‌త నెల‌లో 382 రైల్వే రేకుల ద్వారా 20,16,356 టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ రవాణా చేసింది. ఈ మొత్తం రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేసిన బొగ్గులో  50 శాతం కావ‌డం విశేషం.

అలాగే రాష్ట్ర ఇంధ‌న అవ‌స‌రాలు తీర్చుతున్న రామ‌గుండం ఎన్టీపీపీ ప్లాంట్ల‌కు 7,28,164 ట‌న్నుల బొగ్గును,  అలాగే ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌కు 4,15,839 ట‌న్నుల బొగ్గును స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది.

సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (జైపూర్‌)కు 4,65,579 ట‌న్నుల బొగ్గును స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది.

సింగ‌రేణి బొగ్గు కోసం ఇతర రాష్ట్రాల విన‌తులు…

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు నిరంతర సరఫరా కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో సింగరేణి బొగ్గుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది. కొన్నేళ్లుగా సింగ‌రేణికి వినియోగ‌దారుగా ఉన్న‌ ప‌శ్చిమ‌బెంగాల్ లోని దామోద‌ర వ్యాలీ కార్పోరేష‌న్‌ డీవీసీ నుంచి 1 మిలియ‌న్ ట‌న్నులు, దుర్గాపూర్ లోని ఎన్ టీ ఈసీఎల్ నుంచి 1.2 మిలియ‌న్ ట‌న్ను, ఎన్‌ఎస్‌పీసీఎల్–ఝజ్జర్ (ఆరావళి) నుంచి 1 మిలియ‌న్ ట‌న్నుల‌, త‌మిళ‌నాడులోని ఎన్‌టీఈసీఎల్ నుంచి 2 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గుకు, ఇత‌ర‌ విద్యుత్ సంస్థలు తమకు సింగరేణి బొగ్గును రవాణా చేయాలని  కోరుతున్నాయి.

బొగ్గుకు ఇంత తీవ్రమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో సింగరేణి సంస్థ దీనిని వ్యాపారాత్మకంగా మలుచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల డిమాండ్లను పక్కకు పెట్టి  రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తుంది.

రాష్ట్ర అవసరాలకు ఒడిశాలోని నైనీ బొగ్గు కూడా..

ఒడిశాలో సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తిని ప్రారంభించిన నైనీ బొగ్గు గ‌ని నుంచి కూడా బొగ్గును స్వ‌రాష్ట్రానికి త‌ర‌లిస్తోంది. ఇప్ప‌టికే సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రానికి, యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రానికి ఒక్కొక్క‌టి చొప్పున రైల్వే రేకుల ద్వారా బొగ్గును స‌ర‌ఫ‌రా చేసింది. ఒడిశాలో ర‌వాణా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ రానున్న రోజుల్లోనూ మరింత బొగ్గు స‌ర‌ఫ‌రా చేసేందుకు సంసిద్ధంగా ఉంది.

నైనీలో ప్రస్తుతం 15 ల‌క్ష‌ల టన్నుల బొగ్గు వెలికితీయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ… కేవ‌లం రాత్రి వేళ‌లో మాత్ర‌మే అక్క‌డ బొగ్గును రైల్వే సైడింగ్ వ‌ర‌కు ర‌వాణా చేయ‌డానికి అనుమ‌తి ఉన్నందున ఎక్కువ ప‌రిమాణంలో బొగ్గు స‌ర‌ఫ‌రాను పెంచ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అయినప్ప‌టికీ ఉత్పత్తి చేస్తున్న నైనీ బొగ్గును కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వినియోగిస్తోండ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌త్యేక అధికారుల నియామ‌కం ద్వారా నిరంతర రవాణాకు చర్యలు

రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క గ‌త కొద్ది నెల‌లుగా సింగ‌రేణి స‌హా ఇంధ‌న సంస్థ‌ల‌తో అత్యున్న‌త స‌మ‌న్వ‌య స‌మావేశాల‌ను ఏర్పాటు చేసి త‌గినంత బొగ్గు స‌ర‌ఫ‌రాపై మార్గ‌నిర్దేశం చేశారు. ఈ నేప‌థ్యంలో  సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి, ర‌వాణాను క్ర‌మంగా పెంచుతోంది.

నాణ్యమైన బొగ్గును సకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయటం కోసం సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అయిదుగురు ప్రత్యేక అధికారులను పర్యవేక్షణ కోసం నియమించారు. దీనితో తగినంత బొగ్గు ఉత్పత్తి జరగటమే కాక సకాలంలో సీహెచ్‌పీల ద్వారా  థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా అవుతోంది. ఇందుకు తగినన్ని  రైల్వే రేకులను సమకూర్చుకోవడం, రవాణా చేయటం జరుగుతుంది. ఎల్‌నినో వ‌ల్ల రాష్ట్రంలోని విద్యుత్ డిమాండ్ గ‌తంతో పోల్చితే పెరిగిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఇత‌ర రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రాను త‌గ్గించ‌డం జ‌రిగింది.

Related posts

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

అమిత్ షా అఖిలేష్ మధ్య మాటల యుద్ధం

Satyam News

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

టోలీ చౌకీ యువకుడి దారుణ హత్య

Satyam News

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

Leave a Comment