కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమైనవని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకం క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు వికలాంగులు, వృద్ధులు పెన్షన్ ల కోసం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విన్నవించారు. అర్హులైన వారికి పెన్షన్ లు మంజూరు కు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక మీడియా తో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు అదనంగా తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మూడేళ్ళు కావస్తుంది.. నేటి వరకు ఒక్క లబ్ధిదారుడి కైనా తులం బంగారం ఇచ్చారా అని ప్రశ్నించారు.
అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ను 6 వేలకు పెంచుతామని ఎందుకు పెంచలేదని అన్నారు. నూతన పెన్షన్ లు మంజూరు చేయకపోవడం తో వృద్ధులు, వికలాంగులు ఎంతో ఆశతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇవి ప్రజలు అడిగినవి కాదని, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలేనని గుర్తు చేశారు. హామీల అమలు చేస్తారా లేదా అని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలు ఆత్మగౌరవం తో బ్రతకాలనే ఆలోచన తో కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారుడిపై పైసా భారం లేకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుడి వాటా గా 6 లక్షల రూపాయలు చెల్లించాలని అంటుందని, పేదల వద్ద అంత డబ్బు ఉంటుందా? ఎక్కడ నుండి తెస్తారని ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఎందుకు ఈ విషయాన్ని ప్రకటించలేదని ప్రశ్నించారు. కట్టని ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించడమేంటని ప్రశ్నించారు.
ఇండ్లు కట్టేది ఎప్పుడు.. ఇచ్చేది ఎప్పుడూ.. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని విమర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పాండు నాయక్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, టి. మహేశ్వరి, బన్సీలాల్ పేట, బేగంపేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు టి. శ్రీహరి, నరేందర్, కొండాపురం మహేష్ యాదవ్, కిషోర్, లక్ష్మీపతి, ఆరీఫ్, ఆంజనేయులు, ప్రేమ్, శేఖర్, చంద్ర ప్రకాష్, నాగభూషణం, అబ్బాస్, రవి, మోహిన్, నాగలక్ష్మి, సీమా తదితరులు ఉన్నారు.
