27.1 C
Hyderabad
September 28, 2026
మహబూబ్ నగర్హోమ్

100% రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ

#Srihari

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, మత్స్య సంపద పెంపు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి 100 శాతం రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

సోమవారం వనపర్తి జిల్లా నల్ల చెరువులో 2026–27 సంవత్సరానికి గాను చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.133.3196 కోట్లు కేటాయించిందన్నారు.

చేపల పెంపకానికి అనుకూలమైన ప్రతి నీటి వనరును పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ ఏడాది రాష్ట్రంలోని 26,547 నీటి వనరులకు 84.59 కోట్ల చేప పిల్లలు, సుమారు 300 నీటి వనరులకు 10 కోట్ల రొయ్య పిల్లలను 100 శాతం రాయితీపై సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

ఈ పథకం ద్వారా సుమారు 5 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. చేపల ఉత్పత్తిని పెంచడంతో పాటు మత్స్యకారుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, వారి ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.

6 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం

2026–27 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 6 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేయడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రస్తుతం సుమారు 50 శాతం చెరువుల్లో చేప పిల్లల విడుదలకు అనుకూలమైన నీటి లభ్యత ఏర్పడిందని, అందుకే సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

నల్ల చెరువులో 1.36 లక్షల చేప పిల్లలు

నల్ల చెరువులో మొత్తం 1.36 లక్షల చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.2.82 లక్షలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతగా 1 లక్ష మేలు రకం, 80–100 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన బొచ్చే, రోహు, మ్రిగల రకం చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

చేపల పెంపకానికి అనుకూలమైన నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల పథకాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఆదాయం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ సాధికారతకు శ్రీకారం

Satyam News

పౌర్ణమి సందర్భంగా శ్రీశైల గిరిప్రదక్షిణ

Satyam News

24న వినియోగదారుల హక్కుల దినోత్సవం

Satyam News

వజ్రాల వ్యాపారి కిడ్నాప్: రూ.44 కోట్లు చెల్లింపు

Satyam News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

Satyam News

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News

Leave a Comment