29.1 C
Hyderabad
September 30, 2026
మెదక్హోమ్

సింగరేణి కరెంటు జైపూర్ కు: హరీష్ తీవ్ర అభ్యంతరం

#RevanthReddy

సింగరేణి (జైపూర్) కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.

లేఖ పూర్తి పాఠం ఇది:

గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి,

విషయం: మంచిర్యాల (జైపూర్) సింగరేణి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే కరెంటును రాజస్థాన్‌కు తరలించే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుని, ఆ విద్యుత్‌ను వంద శాతం తెలంగాణ అవసరాలకే వినియోగించాలి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. ఒకవైపు కరెంటు లేక రైతుల పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే, మరోవైపు మన రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేసేందుకు మీరు సిద్ధపడటం ప్రజా వ్యతిరేక చర్య కాక మరేమిటి?

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు మన సింగరేణి గనుల్లోనే ఉంది. నడపడానికి కావాల్సిన నీళ్లు పక్కన ఉన్న గోదావరి నుంచే పుష్కలంగా అందుతాయి. బొగ్గు మనది, నీళ్లు మనవి, స్థలం మనది. అలాంటప్పుడు ఇక్కడ కొత్తగా చేపడుతున్న విస్తరణలో 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు కట్టబెట్టేలా జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? మన బొగ్గు, మన నీళ్లు, మన ప్రాంతంలో తయారయ్యే కరెంటుపై  హక్కు తెలంగాణదే కదా?

ఇటీవల సింగరేణి సంస్థ రాజస్థాన్‌కు చెందిన RRVUNL విద్యుత్ సంస్థ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం  కొత్తగా నిర్మించే థర్మల్ విద్యుత్‌లో 800 మెగావాట్లు రాజస్థాన్‌కు కేటాయిస్తారు. అంతేకాక రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడతారు. ఇది దాదాపు 22,000 కోట్ల భారీ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణి. అలాంటి సింగరేణి విద్యుత్‌ను, పెట్టుబడిని రాజస్థాన్ అభివృద్ధికి ఎందుకు మళ్లించాలి? మన రాష్ట్రమే కరెంటు లేక అల్లాడుతున్న వేళ ఈ తొందరపాటు నిర్ణయం ఎందుకు?

రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ లోటును అధిగమించేందుకు కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో ప్రాజెక్టులు నిర్మించారు. అందులో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సరిగ్గా అందించలేకపోతోంది. రైతులకు 24 గంటల  విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కనీసం 7–8 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ పవర్ హాలిడేలతో రైతులు కన్నీరు పెడుతుంటే, పాలనా వైఫల్యాన్ని ఎల్‌నినో మీదకు నెట్టి తప్పించుకోవాలని చూడటం సరికాదు.

కేసీఆర్ నిర్మించిన పవర్ ప్లాంట్లు ఏమయ్యాయి?

మీ నిర్వహణ లోపం వల్లే నేడు రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలు కునారిల్లుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా కేసీఆర్  నిర్మించిన 4000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ ప్లాంటు.. నేడు యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. దానికి జీ10, జీ11 నాణ్యత గల బొగ్గు వాడాల్సి ఉండగా.. నాసిరకమైన జీ13, జీ14 బొగ్గును వాడి బాయిలర్లు దెబ్బతినేలా చేస్తున్నారు. బొగ్గు కొరతతో కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

నిబంధనల ప్రకారం థర్మల్ కేంద్రాల్లో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి.. కానీ కనీస నిల్ఉత్పత్తి ఉంచకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతున్న మీరు.. విద్యుత్ కేంద్రాల వద్ద ఎందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు? ఈ వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తే, పోలీసులను పెట్టి అడ్డుకోవడం మీ నియంతృత్వానికి నిదర్శనం.

రాష్ట్ర విభజన సమయంలో ఎన్‌టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఎన్టిపిసి 1600 మెగావాట్లు రాష్ట్రానికి ఇస్తామంటే మీ ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రానికి ఎలాంటి అదనపు భారం లేకుండా వచ్చే ఈ విద్యుత్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అని ఎందుకు చెప్పింది?

  1. రాజస్థాన్‌తో చేసుకున్న విద్యుత్ జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి.
  2. జైపూర్‌లో ఉత్పత్తయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను వంద శాతం తెలంగాణే వినియోగించుకునేలా రాష్ట్ర డిస్కంలతోనే (PPA) అగ్రిమెంట్ చేసుకోవాలి.
  3. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం కేంద్రాల్లో బొగ్గు కొరత లేకుండా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  4. రాష్ట్ర విభజన హామీ ప్రకారం ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే పీపీఏ ఒప్పందం చేసుకొని.. రాష్ట్రంలోని రైతులు, ప్రజల కరెంటు కష్టాలను తీర్చాలి.

ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం.

ఇట్లు,

తన్నీరు హరీశ్ రావు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత

Related posts

ఇరాన్ తో చర్చలకు పాక్ చేరుకున్న జేడీవాన్స్

Satyam News

డేరా బాబా పై హత్యకేసు కొట్టివేసిన హైకోర్టు

Satyam News

అమ్మాయిలూ.. జాగ్రత్త!!  పెళ్లి ముసుగులో ప్రమాదం!!

Satyam News

అమెరికాలో రోడ్డు ప్రమాదం: భారతీయ విద్యార్ధిని మృతి

Satyam News

సోషల్ మీడియాలో ‘అన్‌ఫాలో’ కలకలం

Satyam News

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News

Leave a Comment