హైదరాబాద్హోమ్

10 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ

#Lakshman

హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసిన ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ (AIGNF) సెక్రటరీ జనరల్ అనిత పన్వార్ రాష్ట్రంలో నర్సింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అనిత పన్వార్ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సస్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్ల సంక్షేమం, హక్కులు, సేవా నిబంధనల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నర్సింగ్ ఆఫీసర్లు గౌరవప్రదమైన స్థానం పొందాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి నర్సింగ్ ఆఫీసర్ల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఖురానా మేడమ్ ఆధ్వర్యంలో ఈ సమాఖ్య ప్రారంభమైన సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 100 మంది సభ్యులు ముందుకు వచ్చారని, వారిలో నర్సింగ్ ఆఫీసర్ కనకాచార్యులు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం వేలాది మంది నర్సింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్రస్థాయిలో ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు. ఇటువంటి శిక్షణల ద్వారా నర్సింగ్ ఆఫీసర్లు తమ విధులు, సేవా నియమాలు, ప్రభుత్వ వ్యవస్థపై పూర్తి అవగాహన పెంపొందించుకొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించగలరని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమని, దీనివల్ల నర్సింగ్ విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. 1980 నుంచే నర్సింగ్ ఆఫీసర్ల యూనిఫామ్ డ్రస్ కోడ్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నామని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక సంఖ్యలో యువ నర్సింగ్ ఆఫీసర్లు సేవలందిస్తున్నందున, రాబోయే 20–30 సంవత్సరాల పాటు వారు ప్రభుత్వ సేవల్లో కొనసాగనున్న నేపథ్యంలో ఆధునిక డ్రస్ కోడ్ అమలు అవసరమని సూచించారు.

మిడ్‌వైఫ్ సేవలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించడం, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజారోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. నర్సింగ్ వృత్తిలో మహిళలతో పాటు పురుషులు కూడా సమానంగా సేవలందిస్తున్నందున, పదోన్నతుల విషయంలో ఉన్న జీవోలను సవరించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా యునైటెడ్ నర్సస్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్మిన్ షా మాట్లాడుతూ, ఒకప్పుడు శిక్షణ పొందిన నర్సులు అంటే కేరళ గుర్తుకు వచ్చేదని, కానీ నేడు నర్సింగ్ రంగానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, విద్యార్థులకు స్టైఫండ్ అందించడం, నర్సింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

ప్రస్తుతం యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ దేశంలోని 18 రాష్ట్రాలు, 36 దేశాల్లో విస్తరించి సుమారు 16 లక్షల మంది నర్సులను సభ్యులుగా కలిగి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడం ద్వారా వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించడమే కాకుండా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడిందన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కాంట్రాక్ట్ విధానంలోనే నర్సులను నియమిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ నియామకాలు చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.

ఏటా 13–14 వేల మంది నర్సింగ్ విద్య పూర్తిచేసే విద్యార్థులకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రశంసించారు. అలాగే టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో కూడా నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నర్సింగ్ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి, ముఖ్యమంత్రి కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ తరఫున జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణ పాల్గొన్నారు.

Related posts

రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

Satyam News

సాగునీటి సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

Satyam News

ఉప్పలపాడులో 12న 18 దేవతా విగ్రహమూర్తుల ప్రతిష్ట 

Satyam News

నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ

Satyam News

ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై కంటైనర్ బోల్తా

Satyam News

ఏపీలో ఐఫోన్‌ విడిభాగాల తయారీ….!!

Satyam News

Leave a Comment