ముఖ్యంశాలుహోమ్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మెరుపు వేగంతో సహాయ చర్యలు

#Chandra

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. విద్యుత్, రహదారులు, రవాణా, సమాచార వ్యవస్థలను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులుగా తుఫాను పరిస్థితులు, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరే ముందు కూడా ముఖ్యమంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. నేటి ఉదయం 10 గంటల వరకు ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ, మొబైల్ సమాచార వ్యవస్థల పనితీరుపై అధికారులు వివరించారు. ప్రతి శాఖలో గ్రామస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. చివరి వ్యక్తికి కూడా సహాయం అందే వరకు, ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు ఇదే సంకల్పంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడి పనులను పర్యవేక్షించడంతో యంత్రాంగం మరింత వేగంగా స్పందించింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో గణనీయమైన పురోగతి నమోదైంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 5,404 గ్రామాలకు గాను 4,881 గ్రామాల్లో తిరిగి సరఫరా అందుబాటులోకి వచ్చింది. అంటే సుమారు 90 శాతం గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పూర్తయింది. ప్రభావితమైన 552 సబ్‌స్టేషన్లలో 513 పునరుద్ధరించారు. దీంతో సుమారు 93 శాతం పనులు పూర్తయ్యాయి.

ఇంకా 39 సబ్‌స్టేషన్లలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యుత్ సిబ్బంది సహకారం తీసుకుని పనులను వేగవంతం చేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన గ్రామాలన్నింటికీ తిరిగి విద్యుత్ అందించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో దెబ్బతిన్న 509 ప్రధాన 33 కేవీ ఫీడర్లలో 489 పునరుద్ధరించారు. అలాగే 2,958 గ్రామీణ, స్థానిక విద్యుత్ సరఫరాకు సంబంధించిన 11 కేవీ ఫీడర్లలో 2,355 పునరుద్ధరణ పూర్తయింది.

తుఫాను తీవ్ర ప్రభావం చూపిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిన 316 గ్రామాలకు గాను 87 గ్రామాల్లో మాత్రమే సరఫరా పునరుద్ధరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 318 గ్రామాలకు గాను 154 గ్రామాల్లో విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఇంకా 393 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ప్రభావితమైన 915 గ్రామాలకు గాను 867 గ్రామాల్లో విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమైంది.

మొబైల్ సమాచార వ్యవస్థల పునరుద్ధరణలోనూ పురోగతి కనిపిస్తోంది. వివిధ టెలికాం సంస్థలకు చెందిన 1,045 మొబైల్ టవర్లు తుఫాను ప్రభావానికి గురికాగా, ఇప్పటివరకు 661 టవర్లను పునరుద్ధరించారు. మిగిలిన 384 టవర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

రహదారులపై రాకపోకలకు ఏర్పడిన అంతరాయాలను తొలగించడంలోనూ అధికారులు వేగంగా పనిచేశారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిధిలోని రహదారులపై కూలిన మొత్తం 2,270 చెట్లను తొలగించారు. వీటిలో ఒక్క కోనసీమ జిల్లాలోనే 1,334 చెట్లను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. తుఫాను కారణంగా 137 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, 119 చోట్ల రవాణాను పునరుద్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,425.45 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకచోట నీటి ప్రవాహం కారణంగా ప్రస్తుతం రహదారిపై ఒకవైపు నుంచే రాకపోకలు సాగుతున్నాయి.

జలవనరుల శాఖ పరిధిలోనూ పునరుద్ధరణ పనులు చేపట్టారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న 78 చెరువులు, 22 కాలువలు కలిపి మొత్తం 100 ప్రాంతాల్లో తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మరోవైపు భారీ వర్షాలు వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 3,52,254 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. మరో 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను వారికి వివరించి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో జలవనరుల శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకు కురిసిన వర్షాల వల్ల రాష్ట్రానికి సుమారు 380 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు అంచనా వేశారు. పలు ప్రాంతాల్లో వరద ప్రవాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. సమర్థవంతమైన నీటి నిర్వహణతో రిజర్వాయర్లలో అదనంగా 4.68 టీఎంసీల నీరు నిల్వ చేయగలిగారు. మరో 5 నుంచి 6 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

చిన్న నీటిపారుదల చెరువుల్లోకి ఇప్పటికే 22 టీఎంసీల నీరు చేరింది. మరో 8 నుంచి 12 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అంచనా. భూగర్భ జలాలు కూడా సుమారు 44 టీఎంసీల మేర పెరిగాయి. రాబోయే ఐదు రోజుల నీటి ప్రవాహాల అంచనాల ప్రకారం గొట్టా బ్యారేజీకి 16.24 టీఎంసీలు, మడ్డువలసకు 12.01 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

తుఫాను కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ప్రజలకు సాధారణ జీవన పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. చివరి బాధితుడికి కూడా సహాయం అందే వరకు, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts

టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ

Satyam News

ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తి

Satyam News

దేశ భక్తికి నిలువెత్తు రూపం అటల్ బిహారీ వాజ్ పేయి

Satyam News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News

సిగరెట్లు, పాన్ మసాలా ప్రియం

Satyam News

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కు నివాళి

Satyam News

Leave a Comment