26.3 C
Hyderabad
September 27, 2026
హైదరాబాద్హోమ్

దేశ భక్తికి నిలువెత్తు రూపం అటల్ బిహారీ వాజ్ పేయి

#BandiSainjai

మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంజాపూర్‌లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజ్‌పేయి అసమాన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. దేశంలోని అత్యున్నత రాజనీతిజ్ఞుల్లో వాజ్‌పేయి అగ్రగామిగా నిలిచారని పేర్కొన్నారు.

సుమారు ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో వాజ్‌పేయి ‘అజాత శత్రువు’గా పేరుగాంచిన మహానేత అని బండి సంజయ్ అన్నారు. మురికికూపంలా మారిన రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలతో వికసించిన కమలం వాజ్‌పేయి అని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవించే అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతమని తెలిపారు.

పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటూనే దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడని దృఢమైన నాయకుడు వాజ్‌పేయి అని బండి సంజయ్ పేర్కొన్నారు. అవసరమైన సమయంలో దేశ సైనిక, వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన ధైర్యశాలి అని అన్నారు. పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటడంలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

ఐక్యరాజ్య సమితి వేదికపై హిందీలో ప్రసంగించి భారత భాషా, సాంస్కృతిక గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత కూడా వాజ్‌పేయికే దక్కుతుందని బండి సంజయ్ అన్నారు. అద్భుతమైన వక్తగా ఆయన దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు కూడా వాజ్‌పేయి వ్యక్తిత్వాన్ని, వాగ్ధాటిని ప్రశంసించేవారని తెలిపారు.

నిజాయితీకి వాజ్‌పేయి నిలువెత్తు నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. తన జీవిత సర్వస్వాన్ని దేశానికే అంకితం చేసిన అరుదైన రాజకీయ నాయకుడని కొనియాడారు. అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.

తన ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ప్రధాని పదవిని వదులుకున్న సందర్భాన్ని బండి సంజయ్ గుర్తుచేశారు. అధికారాన్ని కాపాడుకోవడం కంటే ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ నైతికతకు వాజ్‌పేయి ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి దేశభక్తి, నిజాయితీ, ధైర్యం, రాజనీతిజ్ఞత భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన చూపిన రాజకీయ విలువలు, దేశ సేవా స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Related posts

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

Satyam News

మహిళా భద్రతకు “సహచరి”

Satyam News

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉంటుందో తెలుసా?

Satyam News

ఏసీఏ అధ్యక్షుడుగా కేసినేని చిన్ని

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

చర్చలకు మేం సిద్ధం: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ప్రకటన

Satyam News

Leave a Comment